వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీలో సమూల ప్రక్షాళన చేస్తున్నారు. కీలక నియోజకవర్గాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. అక్కడ బాధ్యతలను సమర్థవంతమైన నేతలకు అప్పగించే పనిలో పడ్డారు. అందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం బాధ్యతలను కాపు రామచంద్రారెడ్డికి అప్పగించనున్నట్లు సమాచారం.
వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సహించిన నేతల్లో కాపు రామచంద్రారెడ్డి ఒకరు. కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కాపు రామచంద్రారెడ్డికి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎంతగానో ప్రోత్సహించారు. 2009లో కాంగ్రెస్ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచిన కాపు రామచంద్రారెడ్డి అసెంబ్లీలో అడుగుపెట్టారు. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు వేశారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2014లో మాత్రం స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019లో మూడోసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ప్రభుత్వ విప్ గా నియమితులయ్యారు.
జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని నమ్మిన నేతల్లో కాపు రామచంద్రారెడ్డి ఒకరు. అయితే 2024 ఎన్నికల్లో కొత్త వ్యక్తిని తెరపైకి తెచ్చారు జగన్మోహన్ రెడ్డి. కాపు రామచంద్రారెడ్డిని పక్కన పెట్టడంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. తనకు టిక్కెట్ టికెట్ ఇవ్వక పోవడాన్ని సహించుకోలేకపోయారు. బిజెపిలో చేరారు. దీంతో రాయదుర్గంలో టిడిపికి వన్ సైడ్ అయింది. కాలువ శ్రీనివాసులు దాదాపు 40 వేల మెజారిటీతో గెలిచారు. దీనికి కారణం కాపు రామచంద్రారెడ్డి.
అయితే రాయదుర్గం విషయంలో జగన్మోహన్ రెడ్డి మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. తిరిగి కాపు రామచంద్రారెడ్డి కి బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. అందులో భాగంగానే కాపు రామచంద్ర రెడ్డికి ప్రత్యేక పిలుపు వెళ్లినట్లు తెలుస్తోంది. తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చి కలవాలని సమాచారం పంపించినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో కాపు రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి తో చర్చలు జరుపుతారని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రీఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. దీంతో రాయదుర్గం నియోజకవర్గం లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒకరకమైన జోష్ కనిపిస్తోంది.