పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటమి తప్పదా? ప్రతికూల ఫలితాలు వస్తాయని చంద్రబాబు భావిస్తున్నారా? అందుకే పదే పదే మంత్రులతో పాటు ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా కృష్ణ గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ప్రతికూల పరిస్థితులు అధికంగా ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లో సొంత పార్టీ నేతలు టిడిపి అభ్యర్థికి సహకరించడం లేదట. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఓడిస్తామని కూడా హెచ్చరిస్తున్నారట. అభ్యర్థిని ఎవరిని అడిగి ప్రకటించారు అని బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారట. ఎట్టి పరిస్థితుల్లో ఆయనను ఓడించాల్సిందేనని తీర్మానించుకున్నారట. దీంతో ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం విషయంలో చంద్రబాబు తల పట్టుకుంటున్నట్లు సమాచారం.
ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టిడిపి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ బరిలో దిగుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో తెనాలి అసెంబ్లీ టిక్కెట్ను ఆశించారు. కానీ అనూహ్యంగా ఆ టిక్కెట్ను ఆలపాటి రాజా ప్రత్యర్థి నాదెండ్ల మనోహర్ తన్నుకు పోయారు. అయితే ఎన్నికల్లో ఆలపాటి రాజా అంతగా సహకరించలేదు. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ సైతం ఆలపాటి రాజాకు సహాయ నిరాకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు పొన్నూరు ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర బాహటంగానే చెబుతున్నారు. తనను వ్యక్తిగతంగా దెబ్బతీసిన ఆలపాటి రాజాకు సహకరించేది లేదని తేల్చేస్తున్నారు. మధ్యవర్తిగా వచ్చిన మాజీ మంత్రి దేవినేని ఉమా ఎదుట కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. దీంతో ఆయన చేసిందేమీ లేక వెనుదిరిగినట్లు సమాచారం.
మరోవైపు రెండు జిల్లాల్లో కాపులు ఆలపాటి రాజా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేద్దామని తీర్మానించుకున్నట్లు సమాచారం. ఆ రెండు జిల్లాల్లో కాపు వర్సెస్ కమ్మ అన్నట్టు ఉంటుంది పరిస్థితి. అయితే మొన్నటి ఎన్నికల్లో ప్రత్యేక పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గం కూటమికి మద్దతు తెలిపింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు సామాజిక వర్గం విషయంలో ఎటువంటి మార్పు లేకుండా పోయింది. అన్నింటికి రాజీ పడి పవన్ కళ్యాణ్ కూటమిలో సర్దుకుపోవడం కాపు సామాజిక వర్గానికి మింగుడు పడటం లేదు. అందుకే అనుకొని అవకాశంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను మార్చుకోవాలని కాపు సామాజిక వర్గం స్ట్రాంగ్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో 21 అసెంబ్లీ సీట్లలో జనసేన గెలుపొందింది. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ లకు మాత్రమే మంత్రి పదవులు దక్కాయి. మిగతా ఎమ్మెల్యేలకు ఎటువంటి ప్రాధాన్యం లేకుండా పోయింది. దీంతో మిగతా ఎమ్మెల్యేలు సైతం ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టిడిపి అభ్యర్థి ఓడిపోతేనే జనసేనకు, కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యం దక్కుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు వ్యతిరేకిస్తుండడం, కాపు సామాజిక వర్గం సహాయ నిరాకరణతో సీఎం చంద్రబాబుకు ముచ్చమట్టలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ గాని ఓడిపోతే ప్రభుత్వంపై వ్యతిరేకత పతాక స్థాయికి చేరుకుంటుందని.. ఆరు నూరైనా ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సిందేనని మంత్రులతో పాటు కూటమి పార్టీల ఎమ్మెల్యేలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ రెండు జిల్లాల్లో ఆలపాటి రాజా అభ్యర్థిత్వంపై వ్యతిరేకం అధికంగా ఉంది. పోలింగ్ వరకు ఇలానే కొనసాగితే ఆయన ఓటమి ఖాయమని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.