ఎన్ని ఇబ్బందులు వచ్చినా జగన్మోహన రెడ్డి వెంట చివరి వరకు అడుగులు వేస్తామని మాజీ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంటే ఉంటానని తేల్చి చెప్పారు. ఎన్ని కేసులు పెడితే పెట్టుకోండి అంటూ కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఎన్నికల ఫలితాలు అనంతరం కొడాలి నాని కనిపించకపోయేసరికి అనేక రకాల ప్రచారం నడిచింది. ఆయన భయంతో బయట ఉన్నారని కూడా టాక్ నడిచింది. రాజకీయాలనుంచి శాశ్వతంగా తప్పుకుంటారని కూడా వార్తలు వచ్చాయి. కానీ అదేమీ లేదని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని.. చివరి వరకు జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు వేస్తానని తేల్చి చెప్పడంతో ఫుల్ క్లారిటీ వచ్చింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో సైతం ఫుల్ జోష్ కనిపిస్తోంది. కొడాలి నాని మాటలు చూస్తుంటే త్వరలో ఆయన ఆక్టివ్ అవుతారని తెలుస్తోంది.
కొడాలి నాని లో మునుపటి ఫైర్ కనిపిస్తోంది. తగ్గేదేలే అంటూ ఆయన తనదైన శైలిలో స్పందించారు. తన సన్నిహిత మిత్రుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టు తరువాత నాని భయపడుతున్నారని ప్రచారాన్ని కొట్టిపారేశారు. నెక్స్ట్ కొడాలి అరెస్ట్ అంటూ అధికార పార్టీ నేతలు చేస్తున్న ప్రకటనలకు బెదిరిపోనని తేల్చి చెప్పారు. విజయవాడ సబ్ జైలులో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి తో పాటు కొడాలి నాని వచ్చారు. జైలు అధికారులు అనుమతించకపోయేసరికి బయట ఉండిపోయారు.
అయితే కొడాలి నానిని టార్గెట్ చేసింది మీడియా. వరుసగా ప్రశ్నల వర్షం కురిపించింది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కనిపించడం మానేశారు అంటూ రిపోర్టర్ అడిగేసరికి తనదైన రీతిలో సమాధానం చెప్పారు కొడాలి నాని. నీ ఉద్యోగం లేకపోతే ఇలా మైకులు పట్టుకుని తిరుగుతారా అంటూ ఎదురు ప్రశ్న వేశారు. చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణ,టీవీ5 నాయుడు లకు రోజు వచ్చి కనిపించాలా అంటూ నిలదీసినంత పని చేశారు. నారా లోకేష్ రెడ్ బుక్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్కులు, బ్లూ బుక్కులు నన్నేమీ చేయలేవని తేల్చి చెప్పారు. మీ పై మూడు కేసులు నమోదయ్యాయి అని ప్రశ్నించేసరికి.. మూడు కేసులు కాదు 30 కేసులు పెట్టుకోండి అంటూ సవాల్ చేశారు. వల్లభనేని వంశీ అరెస్టు చిన్న విషయంగా తేల్చేశారు. మొత్తానికైతే కొడాలి భయపడుతున్నారు అంటూ ఇన్నాళ్లు జరుగుతున్న ప్రచారానికి చెప్పారు నాని. ఎవరిని అరెస్టు చేసినా పర్వాలేదని.. తాము మళ్లీ అధికారంలోకి వచ్చాక అట్టుకు అట్టున్నర.. రెండు కు మూడు తిరిగి చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడమే తమ టార్గెట్ అని చెప్పుకొచ్చారు కొడాలి నాని.
ఎన్నికల ఫలితాల అనంతరం కొడాలి నాని మీడియాకు సైతం పెద్దగా కనిపించలేదు. వైసిపి కార్యక్రమాల్లో కూడా జాడలేదు. గుడివాడ నియోజకవర్గంలో సైతం యాక్టివిటీస్ ను తగ్గించారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడుతారని కొందరు.. రాజకీయాలకు గుడ్ బై చెబుతారని మరికొందరు.. హైదరాబాద్కు పరిమితమవుతారని ఇంకొందరు ఇలా రకరకాలుగా మాట్లాడారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా మీడియా ముందుకు వచ్చి కొడాలి నాని చాలా ధైర్యంగా మాట్లాడారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆనందిస్తున్నాయి. త్వరలో కొడాలి నాని యాక్టివ్ అవుతారని భావిస్తున్నాయి.