Sunday, March 16, 2025

జనసేనలోకి శిల్ప కుటుంబం.. భూమా అఖిలప్రియ సంచలనం!

- Advertisement -

దేశంలో ఎక్కడా లేని రాజకీయాలు ఏపీలో కనిపిస్తున్నాయి. ఎవరు ఏ పార్టీలో ఉంటారో? ఎవరికి ఎవరు శత్రువులో? ఎవరు ఎప్పుడు దగ్గరవుతారో? తెలియని పరిస్థితి. గత ఎన్నికలకు ముందు అల్లు అర్జున్ వివాదం పతాక స్థాయికి చేరిన సంగతి తెలిసింది. జనసేన ను కాదని ఓ కుటుంబం కోసం కర్నూలు జిల్లా నంద్యాల వెళ్లారు అల్లు అర్జున్. దీంతో జనసేనతో పాటు మెగా అభిమానులకు దూరం అయ్యారు. లేనిపోని ఇబ్బందులు తెచ్చుకున్నారు. అయితే ఏ కుటుంబం కోసం అల్లు అర్జున్ లేనిపోని వివాదాలను తెచ్చుకున్నారో.. ఇప్పుడు అదే కుటుంబం జనసేన వైపు చూస్తున్న ప్రచారం నడుస్తోంది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని టిడిపికి చెందిన ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే బయట పెట్టడంతో మరింత హార్ట్ టాపిక్ అవుతోంది.

ఈ ఎన్నికలకు ముందు నంద్యాల వెళ్లారు అల్లు అర్జున్. తన భార్యతో కలిసి వెళ్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న స్నేహితుడు శిల్పా రవి కిషోర్ కు మద్దతు ప్రకటించారు. అది మొదలు ఆ వివాదం అనేక విధాలుగా రచ్చ చేసింది. ముఖ్యంగా మెగా అభిమానుల్లో చీలికకు కారణం అయింది. మెగా అభిమానులు వేరు.. అల్లు అభిమానులు వేరు అన్నట్టు పరిస్థితి మారింది. అటు తరువాత అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 వివాదాలు అనేక మలుపులు తిరిగాయి. అయితే నాడు అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి శిల్ప రవి కిషోర్ కు మద్దతు తెలపకుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇప్పుడిప్పుడే ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ పడుతూ వస్తోంది.

అయితే రాజకీయ విమర్శలో భాగంగా.. లేకుంటే ప్రత్యర్థిని దెబ్బతీయాలన్న వ్యూహమో తెలియదు కానీ ఆళ్లగడ్డ టిడిపి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పొలిటికల్ బాంబు పేల్చారు. తమ చిరకాల రాజకీయ ప్రత్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి జనసేన లో వెళ్లేందుకు చూస్తున్నారని ఎమ్మెల్యే అఖిల ప్రియ ప్రకటించారు. నంద్యాలలో భూమా – శిల్పా కుటుంబాల మధ్య చిరకాల వైరం ఉంది. 2014లో శిల్పా చక్రపాణి రెడ్డి టిడిపిలో ఉండగా.. భూమా కుటుంబం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండేది. అయితే అనుకోని రీతిలో భూమా అఖిలప్రియ టిడిపిలోకి వచ్చి మంత్రి పదవి తీసుకున్నారు. దీంతో శిల్పా కుటుంబం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయింది. నంద్యాల ఉప ఎన్నికల్లో శిల్ప చక్రపాణి రెడ్డి పై గెలిచారు భూమా బ్రహ్మానంద రెడ్డి. 2019 ఎన్నికల్లో శిల్పా రవిచంద్ర రెడ్డి భూమా కుటుంబాన్ని ఓడించారు. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం నంద్యాల టికెట్ భూమా కుటుంబానికి లభించలేదు.

ప్రస్తుతం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గా ఉన్నారు భూమా అఖిలప్రియ. అయినా సరే శిల్ప కుటుంబం విషయంలో మాత్రం అదే వైరం కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆమె శిల్పా కుటుంబం జనసేనలో చేరనుందని సంచలన ప్రకటన చేశారు. శిల్పా కుటుంబం తమ ఆస్తులను కాపాడుకునేందుకు జనసేనలో చేరుతున్నారు అనేది అఖిలప్రియ ఆరోపణ. అయితే తెర వెనుక ఏదో చిన్న ప్రయత్నం జరగకపోతే ఆమె ఈ విషయం ప్రకటిస్తారా? అన్నది కూడా చర్చ నడుస్తోంది. మొత్తానికి అయితే మెగా, అల్లు కుటుంబం మధ్య చిచ్చు పెట్టిన శిల్పా కుటుంబం జనసేనలో చేరితే మాత్రం పరిస్థితి మరోలా ఉంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!