ఏపీ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ సీటు ఎవరికి? తెలుగుదేశం పార్టీ దక్కించుకుంటుందా? లేకుంటే బీజేపీ ఎగరేసుకు పోతుందా? లేకుంటే జనసేన కోరుకుంటుందా? పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. కొద్ది రోజుల కిందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు విజయసాయిరెడ్డి. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజ్యసభ పదవిని సైతం వదులుకున్నారు. దీంతో ఏపీ నుంచి ఒక రాజ్యసభ సీటు ఖాళీ అయ్యింది. బిజెపి ఆడిన మైండ్ గేమ్ లోనే విజయసాయిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారని ప్రచారం నడిచింది. ఈ లెక్కన ఏపీ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ సీటు బిజెపికి దక్కుతుందని ప్రచారం నడిచింది. అటు బిజెపి నాయకత్వం సైతం రాజ్యసభ స్థానాన్ని తమకు వదిలి పెట్టాలని టిడిపి పై ఒత్తిడి పెంచినట్లు టాక్ నడిచింది. దానికి కారణం లేకపోలేదు. లోక్సభలో ఎన్డీఏ పరంగా స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ లోక్సభలో పెద్ద పార్టీగా అవతరించింది. కానీ ఆ స్థాయిలో రాజ్యసభలో మాత్రం భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యం లేదు. అందుకే ఏపీ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ పదవులు బిజెపి తీసుకోవాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
మొన్నటికి మొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు రాజీనామా చేశారు. పార్టీ పదవులతో పాటు రాజ్యసభ పదవులకు సైతం రాజీనామా ప్రకటించారు. అయితే ఏపీలో పెద్ద పార్టీలుగా ఉన్న తెలుగుదేశం జనసేన లు ఆ మూడు రాజ్యసభ పదవులు పంచుకుంటాయని అంతా భావించారు. కానీ తెలుగుదేశం పార్టీ రెండు రాజ్యసభ స్థానాలను తీసుకుంది. ఉన్న ఒక్కగానొక్క పదవిని బిజెపి కైవసం చేసుకుంది. భారతీయ జనతా పార్టీ కోసం జనసేన త్యాగం చేసింది. తెలుగుదేశం పార్టీ నుంచి బీదా మస్తాన్ రావు, సానా సతీష్ లు రాజ్యసభ పదవులు పొందారు. బిజెపిలో చేరిన బీసీ నేత ఆర్ కృష్ణయ్య రాజ్యసభ పదవి పొందారు. అంటే ఈ విషయంలో జనసేన త్యాగం చేసింది.
అయితే తాజాగా విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన రాజ్యసభ పదవిని బిజెపి తీసుకుంటుందని అంతా భావించారు. కానీ ఆ పదవిని జనసేనకు త్యాగం చేసినట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి ఖాళీ చేసిన స్థానంలో మెగా బ్రదర్ నాగబాబు ఎన్నికవుతారని విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి రాజ్యసభ పదవీ దక్కకపోయేసరికి మెగా బ్రదర్ నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటానని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నాగబాబు రాజ్యసభ పదవి తీసుకుంటారని తాజాగా టాక్ నడుస్తోంది.
ఇప్పటికీ ఏపీ క్యాబినెట్లో చంద్రబాబు సీఎం గా ఉన్నారు. ఆయన కుమారుడు నారా లోకేష్ సహచర మంత్రిగా ఉన్నారు. ప్రభుత్వంతో పాటు తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. అదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఆపై కీలకమైన ఆరు మంత్రిత్వ శాఖలను నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో కుటుంబ పాలన నడుస్తోందన్న విమర్శలు ఉన్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే నాగబాబును క్యాబినెట్ లోకి తీసుకుంటే రకరకాలుగా విమర్శలు వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. అందుకే నాగబాబును రాజ్యసభకు పంపిస్తారని ప్రచారం నడుస్తోంది. పైగా నాగబాబుకు క్యాబినెట్ హోదా కంటే పెద్దల సభలో అడుగు పెట్టాలన్నదే ప్రధానమైన కోరికగా తెలుస్తోంది. అందుకే ఏపీ సీఎం చంద్రబాబు మనసు మార్చుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.