Wednesday, March 19, 2025

న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధంగా వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు

- Advertisement -

ఏపీలో రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. ఎవరు ఏ పార్టీలో ఉంటారో చెప్పలేకపోతున్నారు. అవసరాలు, అత్యవసరాలు నేతలను పార్టీలను మార్చుతున్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఓడిపోయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలు గుడ్ బై చెబుతున్నారు. కూటమి పార్టీల్లో చేరుతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీలో చేరలేని నేతలు జనసేనలోకి.. ఆ రెండు పార్టీల్లో ఛాన్స్ లేని నేతలు బిజెపిలోకి జంప్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎటువంటి అభ్యంతరాలు లేని నేతలు ఇట్టే ఎదుటి పార్టీలో చేరుతున్నారు. కానీ అభ్యంతరాలు వ్యక్తం అవుతుండడంతో చాలామంది నేతలు డిఫెన్స్ లో పడుతున్నారు. అటువంటివారు పొలిటికల్ జంక్షన్లో ఉండిపోతున్నారు.

ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చాలామంది నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కొంతమంది నేతలు అయితే ఎమ్మెల్సీ పదవులను సైతం విడిచిపెట్టారు. పార్టీ సభ్యత్వాలకు కూడా రాజీనామా చేశారు. కానీ అటువంటి వారి రాజీనామాలు ఆమోదానికి నోచుకోలేదు. ముఖ్యంగా ఎమ్మెల్సీల విషయంలో రాజీనామాలపై క్లారిటీ రాలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనమండలి చైర్మన్ ఉండడంతో ఎటువంటి గ్రీన్ సిగ్నల్ లభించడం లేదు. నెలల కిందట చాలామంది ఎమ్మెల్సీలు రాజీనామాలు చేశారు. కానీ ఇంతవరకు వారి రాజీనామాలు ఆమోదానికి నోచుకోలేదు. వారు వ్యక్తిగత ఇబ్బందులతో రాజీనామా చేసినట్లు స్పష్టంగా చెబుతున్నా.. ఎక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి శాసనమండలిలో బలం తగ్గుతుందన్న కోణంలో ఆ పార్టీకి చెందిన చైర్మన్ రాజీనామాలను ఆమోదించడం లేదు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఎమ్మెల్సీ సభ్యత్వాలకు ఓ ఐదుగురు రాజీనామా చేశారు. అందులో పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రీ పద్మశ్రీ, జయ మంగళం వెంకటరమణ తదితరులు ఉన్నారు. అయితే ఇప్పటికే ఇందులో జయ మంగళం వెంకటరమణ జనసేన పార్టీలో చేరారు. మిగతా ఎమ్మెల్సీల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే వీరు పార్టీతో పాటు ఎమ్మెల్సీ పదవులకు కూడా రాజీనామా చేశారు. మండలి చైర్మన్ ఫార్మేట్లో తమ రాజీనామాను ప్రకటించారు. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే పదవులకు రాజీనామా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే మండలి చైర్మన్ వైసీపీకి చెందిన మోసేన్ రాజు కావడంతో వీరి రాజీనామాలకు ఆమోదముద్ర వేయడం లేదు. ఎందుకంటే శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం తగ్గుతుందన్న కోణంలోనే చైర్మన్ వెనుకడుగు వేస్తున్నారు.

2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి డిజాస్టర్ ఫలితాలు వచ్చాయి. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఆ పార్టీకి దక్కలేదు. అసెంబ్లీలో 11 సీట్లకు ఆ పార్టీ దిగజారిపోయింది. కానీ శాసనమండలిలో మాత్రం 38 సీట్లతో ఆ పార్టీ ఇదే అగ్ర స్థానం. శాసనమండలి బలంతోనే కూటమిని ఎదుర్కొంటామని జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేశారు. అప్పటినుంచి శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలాన్ని తగ్గించే ప్రయత్నం చేసింది కూటమి. కానీ శాసనమండలి చైర్మన్ మోసేన్ రాజు దీనికి అడ్డంకిగా నిలిచారు. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదానికి నోచుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. కోర్టుకు వెళ్లి తమ రాజీనామాలను ఆమోదించి.. కూటమి పార్టీలో చేరాలని వారు స్ట్రాంగ్ గా డిసైడ్ అయినట్లు సమాచారం

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!