ఒంగోలులో కూటమిలో విభేదాలు పతాక స్థాయికి చేరాయా? తెలుగుదేశం పార్టీకి జనసేన సవాల్ విసురుతోందా? ఎమ్మెల్యే వెర్సెస్ మాజీమంత్రి అన్నట్టు పరిస్థితి మారిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి టిడిపి అభ్యర్థి దామచర్ల జనార్ధన గెలిచారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఓడిపోయారు. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలోకి ఫీరాయించారు. అప్పటినుంచి కూటమి పార్టీలో తెలుగుదేశం వర్సెస్ జనసేన అన్నట్టు పరిస్థితి మారింది.
ఒంగోలు అంటే ముందుగా గుర్తొచ్చేది బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేరు. 2004లో దివంగత నేత వైయస్ రాజశేఖర్రెడ్డి ప్రోత్సాహంతో తొలిసారిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు బాలినేని. ఆ ఎన్నికల్లో గెలిచి చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009లో రెండోసారి రాజశేఖర్ రెడ్డి బాలినేనికి చాన్స్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో బాలినేని గెలిచేసరికి మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహించారు రాజశేఖర్ రెడ్డి. అయితే రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో మంత్రి పదవిని వదులుకొని మరి జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు వేశారు బాలినేని. ఒక విధంగా చెప్పాలంటే తన పదవిని త్యాగం చేశారు. అయితే 2014 ఎన్నికల్లో బాలినేని ఓడిపోయారు. 2019లో బాలినేని గెలవడం.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో జగన్మోహన్ రెడ్డి తన క్యాబినెట్లో చోటిచ్చారు. కానీ అదే బాలినేని ఈ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేసరికి ఉనికి కోసం జనసేనలో చేరారు.
బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో చేరికను కూటమి నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు రాలేదు. ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే సమయంలో జనసేన పార్టీ శ్రేణులు సైతం బాలినేని చేరికను వ్యతిరేకించాయి. అయితే ఒంగోలు మునిసిపల్ ఎన్నికల్లో 50 డివిజన్లకు గాను.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ ఆరు స్థానాలకు పరిమితం కాగా.. జనసేన ఒక్క స్థానంలో గెలిచింది. రెండు చోట్ల ఇండిపెండెంట్లు విజయం సాధించారు. 41 డివిజన్లలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది.
అయితే ఎన్నికల అనంతరం మారిన పరిణామాలతో ఒంగోలు కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ చేతికి చిక్కింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మేయర్ తో పాటు డిప్యూటీ మేయర్ టిడిపిలోకి వచ్చారు. 31 డివిజన్లతో తెలుగుదేశం పార్టీ ఒంగోలు కార్పొరేషన్ పై స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. అయితే ఓ 15 మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు ఇప్పుడు మనసు మార్చుకున్నారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో జనసేన పార్టీలో చేరుతారని ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే ఒంగోలు కార్పొరేషన్ లో తెలుగుదేశం పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్లిపోవడం ఖాయం. అందుకే ఆ కార్పొరేటర్ లను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు టిడిపి ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన. దీంతో అక్కడ మాజీ మంత్రి బాలినేని వర్సెస్ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన అన్నట్టు పరిస్థితి మారింది. అంతిమంగా అది కూటమి పార్టీలకు చేటు తెచ్చేలా ఉంది.