ఏపీలో జగన్మోహన్ రెడ్డికి ఎదురయింది ఓటమి తప్ప.. ప్రజాదరణ కాదు. ఆయన అభిమానులు.. ఆయనను అభిమానించే ఒక సెక్షన్ ప్రజలు ఎప్పుడూ ఉండనే ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో 40 శాతం ఓట్లతో తనకంటూ బలాన్ని నిరూపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. సీట్లు రాకపోవచ్చు కానీ.. గణనీయమైన ఓటింగ్ శాతాన్ని నిలబెట్టుకున్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేస్తామని చేస్తున్న ప్రయత్నాలు రాజకీయంగా సత్ఫలితాలు ఇస్తాయా? లేదా? అన్నది అటు ఉంచితే… ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి అంటే చెక్కుచెదరని అభిమానం ప్రజల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తుంటే అది స్పష్టంగా తెలుస్తోంది. వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో ఆయనను పరామర్శించేందుకు విజయవాడ సబ్ జైలుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆ ప్రాంగణంలో జనతాకిడి చూస్తే మాత్రం చెక్కుచెదరని అభిమానం ఆయన సొంతమని తేలింది.
పట్టుమని పదేళ్లు ఉండని ఓ బాలిక జగన్మోహన్ రెడ్డి కోసం పరితపించింది. ఆయనను కలిసేందుకు బోరుగా విలపించింది. అన్నా అన్నా అంటూ ఆయన వద్దకు వెళ్లేందుకు ఆ చిన్నారి చేసిన ప్రయత్నం అందరినీ కలచివేసింది. చివరకు జగన్ ఆ చిన్నారిని హత్తుకొని నుదుటిపై ముద్దు పెట్టారు. తన అభిమాన నేతను కలుసుకున్నానన్న ఆనందంతో ఆ చిన్నారి సైతం జగన్మోహన్ రెడ్డి నుదిటిపై ముద్దు పెట్టారు. ఈ చిత్రాలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. అభిమానం ఇలా ఉంటుంది అని చాటి చెప్పేలా ఈ దృశ్యాలు ఉన్నట్లు నెటిజెన్లు వ్యాఖ్యానించారు. అయితే ఈ దృశ్యాలను పక్కన పెడితే… అక్కడకు వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులల్లో ధైర్యం నింపేలా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఉన్నవారే కాదు యావత్ ఏపీలో ఉన్న సగటు వైయస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆశలు సజీవం చేశారు జగన్మోహన్ రెడ్డి.
ఈ ఎన్నికల్లో దారుణ పరాజయం ఎదురయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ నుంచి చాలామంది నేతలు బయటకు వెళ్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద కుట్ర నడుస్తోంది. ఆ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయాలన్న ప్రయత్నంలో కూటమి ప్రభుత్వం ఉంది. అందుకు ఎన్ని రకాల చేయాలో అన్ని రకాలుగా చేస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసులు పెడుతోంది. జైల్లో పెట్టి భయాందోళనకు గురిచేస్తోంది. అయినా సరే అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు సగటు వైయస్సార్ కాంగ్రెస్ అభిమానులు ధైర్యంతోనే ముందుకు వస్తున్నారు. అయితే ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు.
ఎల్లకాలం టిడిపి కూటమి అధికారంలో ఉండదన్న విషయాన్ని గ్రహించుకోవాలని హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి. తప్పు చేసే కూటమి నేతలు.. తప్పులను సమర్థించే అధికారులను విడిచి పెట్టేది లేదని హెచ్చరించారు. సప్త సముద్రాలు అవతల ఉన్న తెచ్చి మరి.. బట్టలూడదీసి నిలబెడతామని హెచ్చరించారు. ఇంతకు ఇంత అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే అధినేత జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి ఇటువంటి మాటలు వస్తుండడంతో సగటు వైయస్సార్ కాంగ్రెస్ అభిమానిలో.. ఒక రకమైన స్థైర్యం కనిపిస్తోంది. బయటకు వచ్చి కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడే విధంగా జగన్మోహన్ రెడ్డి మాటలు ప్రభావితం చేస్తున్నాయి.