Wednesday, March 19, 2025

లక్షలు పలుకుతున్న నామినేటెడ్ పోస్టులు.. ఇవ్వాల్సిందేనంటున్న కూటమి ఎమ్మెల్యేలు!

- Advertisement -

వారంతా పార్టీ కోసం కష్టపడ్డారు. పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించారు. ఎంతగానో పరితపించారు. వారి తపనకు తగ్గట్టుగానే పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో తమకు పదవులు ఖాయమని సంబరపడిపోయారు. తమ స్థాయికి తగ్గ పదవులు వస్తాయని ఆశించారు. కానీ ఇప్పుడు నామినేటెడ్ పదవులకు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి పదవికి ఒక రేటు ఫిక్స్ చేసినట్లు ప్రచారం నడుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతోంది. ఇప్పటివరకు రెండు సార్లు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. మూడోసారి భర్తీ చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. కానీ మధ్యలో రకరకాల అవాంతరాలు ఎదురయ్యాయి. దీంతో వాటికి బ్రేక్ పడింది.

గత రెండుసార్లు నామినేటెడ్ పదవుల ప్రకటనలో భాగంగా వందలాదిమందికి.. పదవులు దక్కాయి. ఇప్పుడు మూడోసారి నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పుకొచ్చారు. కానీ నెలలు గడుస్తున్న భర్తీ మాత్రం చేయలేదు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేసుకుంటూ ముందుకు సాగారు. అయితే ఇప్పుడు కొత్తగా మార్చి నెలాఖరు అన్నట్టు చెబుతున్నారు.

ప్రధానంగా రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్ యార్డ్ చైర్మన్లు, వ్యవసాయ పరపతి సంఘాల చైర్మన్ పోస్టులతో పాటు డైరెక్టర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. తిరుపతి, విజయవాడ, విశాఖ తదితర అభివృద్ధి అధారిటీల చైర్మన్ లను నియమించాల్సి ఉంది. కొన్నేళ్లుగా రాజకీయాల్లో వచ్చిన మార్పు ఏంటంటే.. ప్రతిదీ వేలంపాటే. ఉద్యోగులకు సంబంధించి పోస్టును బట్టి రేటు కడుతున్నారు. రాజకీయంగా నామినేటెడ్ పదవులకు ఆదాయం ఉన్న వాటికి ఓ రేటు, కేవలం హోదా కోసమే కోరుకునే వైతే మరో రేటు పెడుతుండడంతో ద్వితీయ శ్రేణి నేతలు గగ్గోలు పెడుతున్నారు.

అయితే లలిత జువెలరీస్ మాదిరిగా ఊరికే డబ్బులు రావు అంటూ చెబుతున్నారు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు. ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని.. ఊరికే ఏదీ రాదని ఎమ్మెల్యేలు నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల స్థాయిలో ఇచ్చే పదవులకు రేటు ఎక్కువే పలుకుతోంది. పదవి కావాలంటే కోట్లలోనే బేరాలు. ఆ స్థాయిలో ఇచ్చే వాళ్లయితే పార్టీలతో సంబంధం లేకపోయినా.. సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటే ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. దీంతో కష్టపడి జండా మోసిన నేతలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

ప్రధానంగా నియోజకవర్గాల్లో మార్కెట్ కమిటీలకు విపరీతమైన పోటీ ఉంటుంది. వ్యవసాయ ఆధారిత సేవలతో పాటు భారీగా ఆదాయం కూడా సమకూరుతుంది అందుకే ఆ పదవి కోసం ఎక్కువ మంది పైరవీలు చేస్తున్నారు. ఇక ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల చైర్మన్ పోస్టులకు గిరాకీ ఉంది. ఒక్కో పోస్టు లక్షల్లో పలుకుతున్నట్లు సమాచారం. తాము ఎంతో కష్టపడ్డామని.. ఇప్పుడు వసూలు ఏంటని క్యాడర్ ప్రశ్నిస్తోంది. ఇలా అయితే ఈ రాజకీయ వ్యవస్థలో ఇమడలేమని ఎక్కువ మంది తేల్చి చెబుతున్నారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే ఎన్నికల్లో కూటమికి ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!