నెల్లూరు జిల్లాలో పెద్దమనిషి పాత్ర పోషిస్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుతం ఆయన టిడిపి ఎంపీగా నెల్లూరు పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయాలు చేసిన ఆయన పెద్దన్న పాత్రకు ఎక్కువగా ఇష్టపడతారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో గౌరవం దక్కలేదని భావించి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు. అక్కడ ఎంపీ తో పాటు పార్లమెంటరీ స్థాయి సంఘాల్లో ఆయన కోరుకున్న పదవులు దక్కాయి. చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. ఎంపీగా గెలిచిన తొలినాళ్లలో చాలా సంతోషంగా కనిపించేవారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. కానీ ఇటీవల మాత్రం ఆయన పెద్దగా కనిపించడం లేదు. జిల్లా పార్టీలో ఆయనకు తగినంత ప్రాధాన్యం దక్కడం లేదు. అందుకే ఆయన పెద్దగా కనిపించడం లేదని ప్రచారం జరుగుతోంది.
నెల్లూరు జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఒకరు మంత్రి నారాయణ. ప్రస్తుతం అమరావతి రాజధాని నిర్మాణ బాధ్యతలు చూస్తున్నారు. నెల్లూరు అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో.. నగరం సుందరీకరణ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. మరో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అవసరం అయితే తప్ప ఇతర విషయాల్లో జోక్యం చేసుకోవడం లేదు. దీంతో మంత్రి నారాయణ ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ క్రమంలోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ప్రాధాన్యం తగ్గుతోంది. పార్టీ కార్యక్రమాల్లో సైతం ఆయన పెద్దగా కనిపించడం లేదు. జిల్లా సమీక్షలో సైతం ఆయనకు పెద్ద పీట వేయడం లేదు. దీంతో ఆయనలో ఒక రకమైన అభద్రతాభావం ప్రారంభమైనట్లు ప్రచారం నడుస్తోంది.
ఇంకోవైపు వేమిరెడ్డి పేరిట కొంతమంది టిడిపి నేతలు వసూళ్ల దందాకు దిగినట్లు సమాచారం. ఇప్పటివరకు పెద్దమనిషిగా కనిపించిన వేమిరెడ్డి.. అదే స్థాయిని కొనసాగించాలని భావిస్తున్నారు. అయితే ఆయనకు తెలియకుండానే మైనింగ్ మరక అంటించేందుకు కొందరు తెలుగు తమ్ముళ్లు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మైనింగ్ వ్యాపారంలో ఉన్న వేమిరెడ్డి పేరును అడ్డం పెట్టుకొని.. కొంతమంది తమ్ముళ్లు దందాకు దిగినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా తెలుగుదేశం పార్టీ సీనియర్లు ఒక వ్యూహం ప్రకారం ముందుకు తీసుకెళుతున్నట్లు సమాచారం.
నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి నేతలు మంత్రి పదవులు ఆశించారు. అయితే వారికి మంత్రి పదవులు దక్కలేదు. పైగా చంద్రబాబుతో పాటు లోకేష్ వద్ద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రాధాన్యం పెరుగుతోంది. దానిని తగ్గించేందుకే మైనింగ్ మరక అంటించారని ప్రచారం నడుస్తోంది. మొత్తానికైతే తెలుగుదేశం పార్టీలో సైతం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కష్టం మొదలైనట్టే. పెద్దరికం తో పాటు గౌరవాన్ని కోరుకొని వచ్చిన వేమిరెడ్డికి మున్ముందు మరిన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది.