వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చుట్టూ కుట్ర జరుగుతోందా? ఆ పార్టీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారా? అది సాధ్యమయ్యే పనేనా? పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన నాటి నుంచి జరుగుతున్న ప్రయత్నాలు ఒకసారి గుర్తు చేసుకుంటే.. ఏ స్థాయిలో కుట్ర జరుగుతోందో అర్థమవుతుంది. ఈ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకు పరిమితం అయింది. కానీ ఆ పార్టీకి శాసనమండలిలో బలం ఉంది. రాజ్యసభలో సైతం సంఖ్యా బలం ఉంది. అందుకే ఒక పద్ధతి ప్రకారం ఆ సంఖ్యను తగ్గించే ప్రయత్నం జరిగింది. అందులో భాగంగానే ముగ్గురు రాజ్యసభ సభ్యులు బయటకు వెళ్లిపోయారు. పార్టీ పదవితో పాటు రాజ్యసభ సభ్యత్వాలను వదులుకున్నారు. తద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభలో ఉన్న బలాన్ని 8 కి తగ్గించారు. అటు తరువాత పార్టీలో నెంబర్ టు గా ఎదిగిన విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఆ సంఖ్య ఏడుకు చేరుకుంది.
శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 38 మంది ఎమ్మెల్సీలు ఉండేవారు. కానీ క్రమేపి వారి సంఖ్య కూడా తగ్గుతోంది. అయితే ఇలా బయటకు వెళ్తున్న వారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు అధినేత జగన్మోహన్ రెడ్డి పై ఏదో ఒక నిందలు వేస్తున్నారు. బయటకు వెళ్లి పోవడానికి సాకుగా చూపుతున్నారు. తాము వెళ్లాల్సిన పార్టీ నుంచి ఆహ్వానం అందుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి జాబితాలో విశాఖ దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు సమయంలో వాసుపల్లి గణేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వల్లభనేని వంశీ తో పాటు కొడాలి నాని లాంటి నేతలను బయటకు పంపించాలని డిమాండ్ చేశారు. అటువంటి వారితోనే పార్టీకి నష్టం జరిగిందని చెప్పుకొచ్చారు. వారి వ్యాఖ్యలు పార్టీకి భారీగా డ్యామేజ్ చేశాయని విమర్శించారు. విజయసాయిరెడ్డి ఇచ్చిన నివేదికలతోనే ఉత్తరాంధ్రలో పార్టీ ఓడిపోయిందని కూడా తేల్చి చెప్పారు. మాజీ మంత్రి రోజా మాటలు తగ్గించుకోవాలని సూచించారు. అయితే గణేష్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అయితే ఆయన బాధ్యతతో చేయలేదని.. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయేందుకే ఆ వ్యాఖ్యలు చేశారని తాజాగా ప్రచారం ప్రారంభమైంది.
విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచారు వాసుపల్లి గణేష్ కుమార్. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది ఆ నియోజకవర్గం. అందుకే 2009 నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి హ్యాట్రిక్ కొట్టారు. 2019 ఎన్నికల్లో టిడిపి తరఫున గెలిచిన ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. 2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చవి చూశారు. మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం నడిచింది. అది వర్కౌట్ కాకపోయేసరికి బిజెపిలో వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందుకే పార్టీ అధినేత అడగకుండానే సలహాలు ఇచ్చారు. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. కేవలం పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయేందుకు వాసుపల్లి గణేష్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది.