వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీ బలోపేతం పై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఉగాది నుంచి ప్రజల్లోకి రావాలని భావిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని చూస్తున్నారు. మరోవైపు దూకుడు మీద ఉంది కూటమి. వరుసగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసులు మోపుతోంది. అరెస్టులు కూడా జరుపుతోంది. ఇటువంటి సమయంలో బాధితులకు భరోసా ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. వల్లభనేని వంశీ మోహన్ ను పరామర్శించిన క్రమంలో హాట్ కామెంట్స్ చేశారు. ఇంతకు ఇంత బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు. తప్పులు చేసే కూటమి నేతలతో పాటు తప్పుడు పనులకు అండగా నిలుస్తున్న అధికారుల భరతం పడతామని హెచ్చరించారు. సప్త సముద్రాల అవతల ఉన్న తెచ్చి మరి బట్టలూడదీసి నిలబెడతామని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి.
ఇకనుంచి జగన్ 2.0 చూస్తారని కొద్ది రోజుల కిందటే స్పష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి. అందుకు తగ్గట్టుగానే విశ్వరూపం చూపిస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాయి. రెట్టింపు ఉత్సాహంతో వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. ఇదే దూకుడు కొనసాగాలంటే పార్టీ నేతలను క్రియాశీలకం చేయాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే సైలెంట్ గా ఉన్న నేతలను తిరిగి యాక్టివ్ చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే నేను రెడీ అంటూ మాజీ మంత్రి కొడాలి నాని సంసిద్ధత ప్రకటించారు. మరో ఫైర్ బ్రాండ్ పేర్ని నాని సైతం యాక్టివ్ అవుతున్నారు. అయితే ఈ ఇద్దరే కాదు దాదాపు గతంలో దూకుడుగా వ్యవహరించిన నేతలను మళ్లీ రంగంలో దించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలో చాలామంది నేతలకు ప్రత్యేకంగా పిలుపు వెళుతున్నట్లు సమాచారం. వారందరినీ తాడేపల్లి ప్యాలెస్ కి వచ్చి ప్రత్యేకంగా కలవాలని వర్తమానం పంపుతున్నట్లు తెలుస్తోంది.
అయితే వైసిపి అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, ఆర్కే రోజా లాంటి ఫైర్ బ్రాండ్లు ఉండేవారు. అయితే ఇప్పుడు కూటమి దూకుడుగా ఉండడంతో గత తొమ్మిది నెలలుగా వీరు కొంత సైలెంట్ అయిన మాట వాస్తవమే. అయితే కూటమి అరెస్టులతో పాటు కేసులు డోస్ పెంచే అవకాశం ఉందని తెలియడంతో జగన్మోహన్ రెడ్డి రూటు మార్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఎంతలా దూకుడు ప్రదర్శిస్తే.. వైయస్సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అంతలా ప్రాధాన్యమిస్తానని జగన్ చెబుతున్నట్లు సమాచారం. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆఫర్తో చాలామంది నేతలు కేసులకు ఎదురొడ్డి నిలవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
వైయస్సార్ కాంగ్రెస్ యువజన నేతగా ఉండేవారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. చాలా దూకుడుగా ఉండేవారు. జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచేవారు. అనిల్ కుమార్ యాదవ్ లాంటివారు మరింత యాక్టివ్ గా ఉండేవారు. అన్ని వేదికల వద్ద దూకుడు ప్రదర్శించేవారు. ఇటువంటి నేతలంతా ఒకటి రెండు నెలల్లో యాక్టివ్ కావాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇటువంటి నేతలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రత్యేక సమాచారం వెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పుడు గాని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు ప్రదర్శిస్తే భవిష్యత్తు మీదేనంటూ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న ఆఫర్కు వీరంతా ఫిదా అవుతున్నట్లు సమాచారం. మొత్తానికైతే ప్రత్యేక ప్రణాళికతో, పద్ధతి అయిన వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతుండడం విశేషం.