Wednesday, March 19, 2025

జగన్ కు జనాదరణ తగ్గలే!

- Advertisement -

ఇక జగన్ పని అయిపోయింది. ఇక ఆయన లేవలేరు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు. ప్రజలు మరోసారి ఆయనకు చాన్స్ ఇవ్వరు. నిన్న మొన్నటి వరకు ఇదే మాటను చెప్పుకొచ్చారు కూటమి నేతలు. ఒక్కసారిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసులు, అరెస్టుల పర్వాన్ని కూడా ప్రారంభించారు. ఇటువంటి తరుణంలో జనంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ జన సమీకరణ చేయలేదు. జనాలను పోగు చేయలేదు. కానీ వేలాదిగా తరలివచ్చారు. అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో జగన్ పని అయిపోయిందని భావించిన వారంతా కాస్త ఆలోచించడం మొదలుపెట్టారు. ఏదో జరగబోతోంది అని వారిలో అనుమానం కూడా ప్రారంభం అయింది. అందుకే జగన్ పర్యటనపై ఎల్లో మీడియా మరో ప్రచారం మొదలు పెట్టింది. విజయవాడ సబ్ జైలులో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్లారు. కానీ జనాలను దాటుకొని బయటకు రావడం ఆయనకు కష్టతరంగా మారింది. కానీ ఈనాడు మీడియాకు జగన్ కు వచ్చిన జనాదరణ కనిపించలేదు. ఆయన ఒక బలహీనమైన నేత అని చూపించేందుకు ఆ శిక్షణ మీడియా ఆరాటపడింది.

రాజకీయాలు అన్నాక గెలుపోటములు సహజం. అది ప్రజాభిప్రాయం మేరకు ఉంటుంది. ప్రజలు అనుకుంటే అధికారంలోకి తేగలరు. కాదంటే ఓడించగలరు. 2012లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. ఆ పార్టీకి మద్దతుగా 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేశారు. ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఆ సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బ కొట్టింది. తెలుగుదేశం పార్టీని దాదాపు భూస్థాపితం చేసినంత పని చేసింది. కాంగ్రెస్ పార్టీ మూడు సీట్లకు పరిమితం కాగా.. తెలుగుదేశం పార్టీకి ఒక్కచోట కూడా డిపాజిట్ దక్కలేదు. 15 చోట్ల వైయస్సార్ కాంగ్రెస్ విజయం సాధించింది. మూడు చోట్ల డిపాజిట్లు దక్కించుకుంది.

అయితే అన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయిన తెలుగుదేశం పార్టీ పడి లేచిన కెరటంలా మారింది. అక్కడకు రెండేళ్లలో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో 102 సీట్లతో అధికారంలోకి రాగలిగింది. అందుకే ఏ పార్టీని తక్కువ అంచనా వేయలేం. అదే తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికలకు వచ్చేసరికి కేవలం 23 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లతో ఘనవిజయం సాధించింది. ఏకంగా 51 శాతం ఓట్లతో కనివిని ఎరుగని గెలుపును సొంతం చేసుకుంది. అయితే 2024 ఎన్నికలకు వచ్చేసరికి మళ్ళీ సీన్ మారింది. మూడు పార్టీలు కూటమి కట్టడంతో అప్రతిహాస విజయాన్ని సొంతం చేసుకుంది టిడిపి కూటమి. జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు. అలాగని 40 శాతం ఓట్లతో ఇంకా జనంలో నానుతూ వస్తున్నారు.

అయితే ఇక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని.. జగన్మోహన్ రెడ్డికి పని అయిపోయిందని ప్రచారం చేస్తున్నారు కూటమి నేతలు. కానీ జగన్ ను కలిసేందుకు.. చూసేందుకు జనం విరగబడి వస్తున్నారు. అది కూటమి నేతల్లో మింగుడు పడని అంశంగా మారుతుంది. మున్ముందు జగన్ జనంలోకి వస్తే ప్రభంజనం సృష్టించడం ఖాయమని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. పదవీకాలం కరుగుతున్న వేళ కూటమి నేతల్లో సైతం ఒక రకమైన భయం ఏర్పడుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!