Sunday, March 16, 2025

డోన్ వైసిపి ఇన్చార్జిగా యంగ్ స్టార్.. జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్!

- Advertisement -

కర్నూలు జిల్లాలో మరో రాజకీయ వారసుడు యాక్టివ్ అవుతున్నాడా? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీరోల్ ప్లే చేయనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కర్నూలు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి మంచి ఫలితాలు సాధిస్తూ వచ్చింది. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం దారుణంగా దెబ్బతినింది. దాదాపు జిల్లాలో కూటమి పాగావేసింది. కూటమి ప్రభంజనంలో పెద్ద నాయకుల సైతం కొట్టుకుపోయారు. ప్రధానంగా డోన్ నియోజకవర్గం నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఓటమి చవిచూశారు. ముచ్చటగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొడతారని అంతా భావించారు. కానీ ఆయన అంచనాలు తలకిందులయ్యాయి. దారుణ పరాజయం ఎదురైంది. చంద్రబాబు ప్రయోగం ఫలించి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి అక్కడ గెలిచారు.

అయితే ఎన్నికల ఫలితాలు అనంతరం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నియోజకవర్గంలో పెద్దగా ఉండడం లేదన్న విమర్శ ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కు దూరంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన సూర్యప్రకాశ్ రెడ్డి ప్రజల్లోకి బలంగా దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి డోన్ నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 2014 ఎన్నికల్లో రాజేంద్రనాథ్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో రెండోసారి గెలిచేసరికి జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కీలకమైన ఆర్థిక శాఖను అప్పగించారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో సైతం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని కొనసాగించారు. దాదాపు మంత్రులందరినీ తొలగించిన రాజేంద్రనాథ్ రెడ్డి కొనసాగింపు తో ఆయన ఎంత గట్టి నేతో అర్థమవుతుంది. అటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2024 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు.

అయితే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దూకుడు మీద ఉండేవారు రాజేంద్రనాథ్ రెడ్డి. శాసనసభ తో పాటు బయట పిట్ట కథలతో చంద్రబాబును ఓ రేంజ్ లో విమర్శించేవారు. మంచి వాగ్దాటితో తెలుగుదేశం పార్టీ పై విమర్శలు చేసేవారు. అయితే అందుకే ఇప్పుడు ఎన్నికల ఫలితాలు అనంతరం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సైలెంట్ అయ్యారని ప్రచారం జరుగుతోంది. ఎక్కడ కూటమి టార్గెట్ చేసి వ్యాపారాలకు ఇబ్బంది పెడుతుందని భావించి బుగ్గన సైలెంట్ అయినట్లు ప్రచారం నడుస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఆమధ్య కొన్ని కేసులలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేరు బయటపడింది. అయితే డోన్ నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన కేడర్ ఉంది. ఆ క్యాడర్కు భరోసా లేకపోవడంతో క్రియాశీలక నేతలు కొంతమంది అధినేత జగన్మోహన్ రెడ్డిని ఆశ్రయించారు. దీంతో అధినేత నేరుగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ని పిలిచి మాట్లాడినట్లు సమాచారం.

అయితే బుగ్గన రాజేంద్రనాథ్ కుమారుడు అర్జున్ రెడ్డి నియోజకవర్గ బాధ్యతలు తీసుకుంటారని మరో ప్రచారం నడుస్తోంది. 2029 ఎన్నికల నాటికి అర్జున్ రెడ్డిని యాక్టివ్ చేయాలని రాజేంద్రనాథ్ రెడ్డి భావిస్తున్నారు. అందుకు జగన్మోహన్ రెడ్డి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. ఉగాది నుంచి నియోజకవర్గంలో యాక్టివ్ కావాలని అర్జున్ రెడ్డి భావిస్తున్నారు. దీంతో డోన్ నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన జోష్ ప్రారంభం అయింది. అయితే అక్కడ మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ప్రస్తుత ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి లాంటి పెద్ద నేతలు ఉన్నారు. వీరిద్దరితో తండ్రి కొడుకులు తలపడనున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!