ఏపీలో కూటమి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అందుకు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక వేదిక అయింది. ఈనెల 27న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి పోలింగ్ జరగనుంది. మూడు జిల్లాలకు చెందిన ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సుమారు 23 వేల మంది వరకు ఓటర్లు ఉన్నారు. పదిమంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే ముగ్గురు మధ్య ప్రధానమైన పోటీ నడుస్తోంది. యుటిఎఫ్ నుంచి విజయ గౌరీ, పిఆర్టియు నుంచి మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, ఏపీటీఎఫ్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ బరిలో ఉన్నారు. ఈ ముగ్గురు మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టు ఉంది.
అయితే తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా ఏపీటీఎఫ్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మకు మద్దతు ప్రకటించింది. గతంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే రఘువర్మ టిడిపి అభ్యర్థికి మద్దతు తెలిపారు. అందుకే ఇప్పుడు రఘువర్మకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ ప్రత్యేక ప్రకటన జారీచేసింది. పార్టీ శ్రేణులు కూడా రఘువర్మకు మద్దతుగా ప్రచారం చేయాలని సూచించింది. విశాఖ ఎంపీ శ్రీ భరత్ ప్రత్యేక ప్రకటన చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ అభిప్రాయం క్లియర్ అయింది.
అయితే బిజెపి మాత్రం పిఆర్టియు నుంచి పోటీ చేస్తున్న గాదె శ్రీనివాసులు నాయుడుకు మద్దతు ప్రకటించింది. ఆయన గతంలో రెండు సార్లు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2007, 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గాదె శ్రీనివాసుల నాయుడుకు మద్దతు తెలిపింది. అయితే 2019లో మాత్రం గాదె శ్రీనివాసులు నాయుడు రఘువర్మ చేతిలో ఓడిపోయారు. అయితే గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తమకు మద్దతు తెలిపారు అన్న గౌరవంతో.. తెలుగుదేశం పార్టీ రఘువర్మకు మద్దతు ఇచ్చింది. అయితే కూటమిలోని మరో పార్టీ అయిన బిజెపి మాత్రం గాదే శ్రీనివాసులు నాయుడుకు మద్దతు ప్రకటించింది.
అయితే తమను కనీస స్థాయిలో సంప్రదించకుండా పిఆర్టియు అభ్యర్థి గాది శ్రీనివాసుల నాయుడుకు ఎలా మద్దతు తెలుపుతారని టిడిపి ప్రశ్నిస్తోంది. బిజెపి తరఫున ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడు పివిఎన్ మాధవ్ శ్రీనివాసులు నాయుడుకు నేరుగా మద్దతు ప్రకటించారు. అయితే ఈ చర్యను తప్పుపడుతోంది తెలుగుదేశం. ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో కూటమి పార్టీల మధ్య చర్చ జరగాలి కదా అని టిడిపి అభిప్రాయపడుతోంది. కనీసం తమ అభిప్రాయాన్ని తీసుకోకుండా ఎలా మద్దతు ప్రకటిస్తారని నిలదీసినంత ప్రయత్నం చేస్తోంది. దీంతో కూటమి పార్టీల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మున్ముందు ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి.
అయితే ఆది నుంచి ఉత్తరాంధ్ర బిజెపి టిడిపి టిడిపి విషయంలో భిన్నంగా వ్యవహరిస్తోంది. కొందరు నేతల వైఖరి అభ్యంతరకరంగా ఉంటుందని టిడిపి నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. కనీస స్థాయిలో టిడిపి అంటే గౌరవం ఇవ్వడం లేదని.. మున్ముందు ఈ పరిణామాలు కూటమిలో విఘాతం కలిగించడానికి కారణం అవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.