Sunday, March 16, 2025

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్న వామపక్షాలు!

- Advertisement -

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో వామపక్షాల అభిప్రాయం మారుతోందా? వామపక్షాలను దగ్గర చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారా? కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఉమ్మడి పోరాటం చేయాలని చూస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పిడిఎఫ్ అభ్యర్థులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపే అవకాశం ఉంది. కృష్ణ, గుంటూరు.. ఉభయగోదావరి జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఈనెల 27న జరగనుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదు. తెలుగుదేశం పార్టీ మాత్రం ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. అయితే తమ పార్టీ అభ్యర్థులు రంగంలో లేకపోవడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పిడిఎఫ్ అభ్యర్థులకు మద్దతు తెలిపే అవకాశం కనిపిస్తోంది.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి వామపక్షాలు వ్యతిరేకంగానే పనిచేశాయి. ఇప్పటికీ అదే ధోరణితో ఉన్నాయి. 2014 ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీతో జత కట్టింది బిజెపి. జనసేన బయట నుంచి మద్దతు ప్రకటించింది. ఆ సమయంలో సైతం వామపక్షాలు ఒంటరిగా పోటీ చేశాయి. 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వంటరి పోరాటమే చేసింది. తెలుగుదేశం పార్టీతో విడిపోయిన జనసేన వామపక్షాలతో జతకట్టింది. ఆ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే అప్పటి వరకు వామపక్షాలతో ఉన్న పవన్ బిజెపితో చేతులు కలిపారు. అయినా సరే వామపక్షాల తీరు మారలేదు. గత ఐదేళ్లుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా ద్వేషిస్తూ వస్తున్నాయి వామపక్షాలు . 2024 ఎన్నికల్లో బిజెపితో తెలుగుదేశం పార్టీ జతకట్టింది. జనసేన సైతం వాటితో కూటమి కట్టి బరిలో దిగాయి. అయితే ఆ సమయంలో సైతం వామపక్షాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమిని కోరుకున్నాయి. అందుకు అన్ని విధాల పావులు కదిపాయి.

అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం లేదు. ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తోంది. ఇటువంటి సమయంలో వామపక్షాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో జత కట్టలేని అనివార్య పరిస్థితి. అందుకే ఇప్పుడు ఉమ్మడి కార్యాచరణ కింద ప్రభుత్వంపై పోరాట బాట పట్టే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ప్రజా సంఘాల ఐక్య కూటమికి జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలపనున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వనున్నారు. అదే జరిగితే వామపక్షాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావడం ఖాయం. వామపక్షాలది ప్రభుత్వం పై పోరాటం చేయడంలో కీలక పాత్ర. క్షేత్రస్థాయిలో మంచి బలం ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వామపక్షాల బలం తోడైతే.. కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెల్లుబికడం ఖాయం.

ఏపీలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వామపక్షాలతో జత కలవడమే మేలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం అభిప్రాయపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పెద్దగా బలం లేదు. ఆ పార్టీలో ఉన్న కొద్దిమంది నేతలు సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వామపక్షాలది రాష్ట్రవ్యాప్తంగా బలమైన నెట్వర్క్. ప్రజాసంఘాలతో మంచి సంబంధాలు ఉంటాయి. అందుకే వామపక్షాలతో జత కలిస్తే ప్రజాసంఘాలు సైతం వైయస్సార్ కాంగ్రెస్తో కలిసి పనిచేస్తాయి. ఈ ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నట్లు సమాచారం.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!