వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలామంది నాయకులు ఆయాచితంగా పదవులు పొందారు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నచందంగా చాలామంది నేతలు దొడ్డి దారిన పదవులు పొందారు. అటువంటి వారిలో మొండితోక సోదరులు జగన్మోహన్ రావు, అరుణ్ కుమార్ ఎనలేని ప్రాధాన్యం పొందారు. జగన్మోహన్ రావు ఎమ్మెల్యేగా , అరుణ్ కుమార్ ఎమ్మెల్సీగా పదవులు సొంతం చేసుకున్నారు. కానీ రాజకీయంగా లబ్ధి పొందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఈసారి న్యాయం చేయలేకపోయారు. గత ఐదేళ్లలో వందల కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడ్డారు. కానీ అలా దోపిడీ చేసిన వారు పార్టీకి ఎటువంటి న్యాయం చేయలేదు కదా.. సామాన్య వైసిపి కార్యకర్త ఆశించిన మాదిరిగా కూడా న్యాయం చేయలేకపోయారు. అధినేత జగన్మోహన్ రెడ్డి తో పాటు పార్టీకి అన్యాయం చేశారు.
తెలుగుదేశం పార్టీకి కంచుకోట నందిగామ నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ గెలుస్తూనే ఉన్న నియోజకవర్గాల్లో ఇది ఒకటి. 1994, 1999, 2004, 2009, 2012, 2014 ఇలా వరుసగా ఆరుసార్లు నందిగామ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తూ వచ్చింది. అటువంటి నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో బాగా వేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ నియోజకవర్గ కమ్మ సామాజిక వర్గానికి పెట్టని కోట. నియోజకవర్గంలో నందిగామ, వీరులపాడు, చందర్లపాడు, కంచికర్ల మండలాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి అత్యంత సురక్షితమైన కంచుకోట లాంటి నియోజకవర్గం నందిగామ. ఇక్కడ నుంచి 2019 ఎన్నికల్లో గెలిచారు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు. తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. అక్కడ నుంచి మొండితోక ఫ్యామిలీ పట్టిందల్లా బంగారంలా మారింది.
తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అభ్యర్థులే నందిగామ నియోజకవర్గం నుంచి గెలిచారు. అటువంటి నియోజకవర్గంలో మొండితోక జగన్మోహన్ రావు తన ప్రభావాన్ని చూపారు. ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈ గెలుపు నాకు కారణం మొండితోక అరుణ్ కుమార్ అని భావించి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అంతటితో ఆగకుండా కృష్ణాజిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కూడా అవకాశం కల్పించారు. అయితే నియోజకవర్గంలో అన్నదమ్ములు ఇద్దరు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కావడంతో వారు ఆడింది ఆట.. పాడింది పాట అన్నట్టు పరిస్థితి మారింది. ఈ క్రమంలోనే వారి ఒంటెద్దు పోకడలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విసిగి వేసారి పోయాయి. అదే సమయంలో టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ తంగిరాల సౌమ్య నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సత్తా చాటారు. మొండితోక బ్రదర్స్ ఆగడాల మూలంగా విసిగి వేసారి పోయిన నియోజకవర్గ ప్రజలు తంగిరాల సౌమ్యకు జై కొట్టారు. 27 వేల ఓట్ల మెజారిటీతో పట్టం కట్టారు.
గత ఐదేళ్లుగా మొండితోక బ్రదర్స్ కు ఎనలేని గౌరవం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. కానీ పార్టీ కష్టకాలంలో ఉన్న ప్రస్తుత సమయంలో మొండితోక బ్రదర్స్ జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చారు. పార్టీ ద్వారా వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఆ బ్రదర్స్.. ఇప్పుడు పార్టీ గురించి పట్టించుకోవడం మానేశారు. అది వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డికి జీర్ణించుకోలేని అంశం. అందుకే నందిగామ నియోజకవర్గంలో మొండితోక బ్రదర్స్కు బదులు ప్రత్యామ్నాయ నాయకత్వం పై దృష్టి పెట్టినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే మొండితోక బ్రదర్స్ వైఖరితో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం విసిగిపోయాయి. ప్రత్యామ్నాయంగా కొత్త నాయకత్వాన్ని తెరపైకి తేవాలని కోరుతున్నాయి. మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎటువైపు అడుగులు వేస్తారో చూడాలి.