విజయసాయిరెడ్డి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా? ఆయన శాశ్వతంగా రాజకీయాలనుంచి వెళ్లలేదా? మనస్ఫూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించలేదా? అసలు రాజకీయాలే మాట్లాడనని చెప్పిన ఆయన మళ్లీ అవే అంశాలను ఎందుకు ప్రస్తావిస్తున్నట్టు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. సాయి రెడ్డి మాటలు చూస్తుంటే కచ్చితంగా ఆయన పొలిటికల్ రీఎంట్రీ ఇస్తారా అన్న అనుమానం కలుగుతోంది.
కొద్దిరోజుల కిందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి. పార్టీ ప్రాథమిక సభ్యత్వం తో పాటు పార్టీ పదవులను వదులుకున్నారు. రాజ్యసభ పదవికి సైతం రాజీనామా చేశారు. ఇకనుంచి వ్యవసాయం చేసుకుంటానని మాత్రమే చెప్పుకొచ్చారు. రాజకీయాల జోలికి పోనని.. రాజకీయ అంశాలు ప్రస్తావించనని తేల్చి చెప్పారు. కానీ అలా చెప్పిన విజయసాయిరెడ్డి చర్యలు చూస్తే మళ్ళీ ఆయన రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తనకు ఇన్నాళ్లపాటు అవకాశం కల్పించిన అధినేత జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మళ్లీ మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఇవన్నీ పాజిటివ్ దృక్పథంతో చేసిన కామెంట్స్. కానీ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలపడం అనుమానాలకు తావిచ్చింది. ఆపై తన రాజీనామాతో కూటమికే మేలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే అప్పట్లో ఎవరికీ అనుమానం రాలేదు. కానీ ఇటీవల ఆయన చేసిన కామెంట్స్ తో మాత్రం.. ఆయన పొలిటికల్ ఎజెండాతోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పినట్లు అర్థమవుతోంది.
రాజకీయాలకు గుడ్ బై చెప్పి.. వ్యవసాయం చేసుకుంటానన్న విజయసాయిరెడ్డి మాటల్లో నిలకడ కనిపించడం లేదు. దీనిపైనే అందరిలో ఒక రకమైన అనుమానం ఉంది.
విజయసాయి రెడ్డి తాజా కామెంట్స్ మళ్లీ ఆయన రాజకీయాల్లోకి వస్తారని అనుమానాలను కలిగిస్తున్నాయి. కాకినాడ సీ పోర్టు వాటాల వ్యవహారంలో సిఐడి ఆయనకు నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరయ్యారు. కానీ ఆయన బయటకు వచ్చి విచారణకు సంబంధించిన అంశాలే చెప్పాలి. కానీ ఆయన నేరుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆరోపణలు చేశారు.
అసలు సంబంధంలేని లిక్కర్ స్కాం విషయంలో విజయసాయిరెడ్డి ప్రస్తావించడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఒకవైపు వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి పేరు చెప్పారు. మరోవైపు కెవి రావుతో వైవి సుబ్బారెడ్డి తో సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా మరింత సమాచారం తన వద్ద ఉందని.. అడిగితే తప్పకుండా ఇస్తానని కూడా తెగేసి చెప్పారు.
అయితే ఎప్పుడైతే విజయసాయిరెడ్డి కొన్ని పేర్లతో ఓపెన్ అయ్యారో అప్పుడే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఆయన తప్పకుండా పొలిటికల్ రీఎంట్రీ ఇస్తారని అర్థమవుతోంది. ఒకరిద్దరు నేతలు అయితే చంద్రబాబుకు సాయం చేసేందుకు విజయసాయిరెడ్డి సిద్ధపడిపోయారని అంచనాకు కూడా వచ్చారు. సో ఇలానే చూస్తుంటే విజయసాయిరెడ్డి ఏదో ఒక పార్టీలో చేరుతారని బలమైన ప్రచారం జరుగుతోంది.