కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సహజంగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజల నుంచి ఒక రకమైన అసంతృప్తి రావడం ఖాయం. అయితే ఈ ఏడాది నుంచి సంక్షేమ బాట పడతామని ప్రభుత్వం చెబుతోంది. వార్షిక బడ్జెట్లో నిధులు కేటాయించడంతో సంక్షేమ పథకాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీంతో పరిస్థితి గాడిన పడుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
అయితే 2024 ఎన్నికల్లో వీరు వారు అన్న తేడా లేకుండా అన్ని వర్గాల వారు టిడిపి కూటమికి అండగా నిలబడ్డారు. కులమతాలకు రహితంగా మెజారిటీ ప్రజలు కూటమికి జై కొట్టారు. అటువంటి వారిలో కూడా ఒక రకమైన వ్యతిరేకత ప్రారంభం అవుతుంది. దీనిని గమనించి ముందుకు సాగకపోతే కూటమికి ఇబ్బందులు తప్పవు.
ప్రధానంగా ముస్లింలు కూటమి ప్రభుత్వంపై రగిలిపోతున్నారు. ఆది నుంచి వీరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండేవారు. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం కూటమి వైపు మొగ్గు చూపారు. కానీ ఇప్పుడు కూటమి చర్యలతో విసిగిపోయారు. వక్ఫ్ బిల్లునకు సంబంధించి కేంద్రం చర్యలను చంద్రబాబు వ్యతిరేకించలేదు. ఈ సవరణ బిల్లుతో దేశవ్యాప్తంగా ముస్లింల ఆస్తులు ప్రభుత్వ స్వాధీనంలోకి వెళ్ళనున్నాయి. అయితే ఈ బిల్లును వ్యతిరేకించాలని ముస్లిం సంఘాలు ముక్తకంఠంతో కోరాయి. కానీ చంద్రబాబు మాత్రం ఎన్డీఏ భాగస్వామ్య పక్షం కావడంతో సైలెంట్ అయ్యారు. దీనినే తప్పు పడుతున్నారు ముస్లింలు.
రాష్ట్రవ్యాప్తంగా ఇఫ్తార్ విందు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం భావించింది. ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించింది. కానీ ఒక్క జిల్లాలో కూడా ముస్లింలు సంతృప్తిగా ఇఫ్తార్ విందుకు హాజరు కావడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మున్ముందు ముస్లింల ఆగ్రహం మరింత పెరిగే అవకాశం ఉంది.
మరోవైపు క్రిస్టియన్లు సైతం కూటమి ప్రభుత్వంపై కుతకుతలాడుతున్నారు. ఆది నుంచి ఈ వర్గాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చాయి. అయితే 2024 ఎన్నికల్లో ఈ వర్గంలో చీలిక వచ్చింది. అది కూటమికి ఎంతగానో లాభం చేసింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాలను సైతం రద్దు చేసింది కూటమి ప్రభుత్వం. అప్పటినుంచి క్రిస్టియన్ వర్గాల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ప్రారంభం అయ్యింది.
తాజాగా పాస్టర్ అనుమానాస్పద మృతి ప్రభుత్వం పట్ల అసంతృప్తికి కారణమవుతోంది. పాస్టర్ ది యాక్సిడెంట్ అని ప్రభుత్వం చెబుతోంది.. కానీ ఇన్సిడెంట్ అని క్రిస్టియన్ సంఘాలు ఆరోపిస్తున్నాయి. పైగా ఆ పాస్టర్ కి క్రిస్టియన్ వర్గాల్లో విపరీతమైన అభిమానులు ఉన్నారు. వారంతా ఆయనది హత్యనని అనుమానిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. దీంతో వారు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ రెండు మతాలు వచ్చే ఎన్నికల నాటికి దూరమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి బలంగా ప్రజల్లోకి వస్తే ఈ రెండు వర్గాలు వైయస్సార్ కాంగ్రెస్ వైపు టర్న్ కావడం ఖాయం. అదే జరిగితే కూటమికి భారీ డ్యామేజ్ తప్పదు.