కడప జిల్లాలో కూటమి పాచిక పారలేదు. కడప జిల్లా పరిషత్ పీఠాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పదిలం చేసుకుంది. జిల్లా పరిషత్ చైర్మన్ గా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ గోవిందరెడ్డి ఎన్నికయ్యారు. ఎలాగైనా కడప జడ్పీ పీఠాన్ని దక్కించుకొని జగన్మోహన్ రెడ్డికి గట్టి సవాల్ చేయాలని కూటమి భావించింది. కానీ వీలుకాక చేతులెత్తేసింది.
కడప జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న నేత రాజంపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ఇక్కడ చైర్మన్ ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే విపరీతమైన అధికార బలంతో, ప్రలోభాలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పిటిసిలను తమ వైపు తిప్పుకోవాలని భావించింది కూటమి. కానీ జడ్పిటిసిలు ఎవరు ప్రలోభాలకు లొంగలేదు. ఓ అయిదుగురు మాత్రం అటువైపుగా మొగ్గు చూపారు. 42 మంది జడ్పీటీసీలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు బలంగా నిలబడ్డారు. దీంతో కూటమి ప్రయత్నాలు బెడిసి కొట్టాయి.
ఇంకోవైపు జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక నిలపాలని టిడిపి అనేక విధాలుగా ప్రయత్నాలు చేసింది. కొద్ది రోజులపాటు ఎన్నిక వాయిదా వేయగలిగితే జడ్పిటిసి లను తమ వైపు తిప్పుకోవచ్చని ఆలోచన చేసింది. ఓ రెండు జెడ్పిటిసిలు ఖాళీగా ఉండడంతో దానిని సాకుగా చూపి ఎన్నికల వాయిదా వేయాలని టిడిపి కోర్టును ఆశ్రయించింది.
అయితే ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఎన్నికలకు ఏర్పాట్లు చేయడంతో.. ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో ఆ ఆశ లేకపోవడంతో టీడీపీ నీరు గారి పోయింది. కడప జడ్పీపీఠంపై ఆశలు వదులుకుంది. కడప జడ్పీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు టిడిపి జిల్లా అధ్యక్షుడు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి.
అయితే 10 నెలల కూటమి పాలనలో అనేక రకాల ప్రలోభాలు ఎదురయ్యాయి. కానీ తామంతా జగన్మోహన్ రెడ్డి వెనుకేనని నిరూపించారు జడ్పిటిసి సభ్యులు. కడప జగన్మోహన్ రెడ్డి దేనని తేల్చేశారు. కూటమి ప్రయత్నాలకు ప్రతిసారి చెక్ చెబుతూ కడప జిల్లా పరిషత్ పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేశారు.