నిజం చెప్పులేసుకుని బయలుదేరే ముందే.. అబద్ధం ఊరంతా ప్రచారం చేసి వస్తుందంటారు. జగన్మోహన్ రెడ్డి విషయంలో జరిగింది ఇదే. ఆయన చేసింది చెప్పుకోలేకపోయారు. అమలు చేయలేని హామీలు ఇవ్వలేకపోయారు. ఫలితంగా ఓటమి చవిచూశారు. అయితే అలవి కాని హామీలు ఇచ్చి కూటమి అధికారంలోకి వచ్చింది. 9 నెలలు అవుతున్న అమలు చేయలేకపోయింది. దీంతో ఇప్పుడిప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి.
అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అన్నీ తెలుసులే అని తేలిగ్గా తీసుకున్నారు. అందుకే చేసినవి చెప్పుకోలేకపోయారు. అయితే ఇప్పుడు ఓటమి ఎదురయ్యేసరికి ఆయనకు తత్వం బోధపడింది. అందుకే ఇప్పుడు తాను చేసినవి చెప్పుకోవడం కంటే.. టిడిపి ప్రభుత్వ వైఫల్యాలను వివరించే క్రమంలో గత ప్రభుత్వంలో చేసిన పనులను చెబుతున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తున్నారు.
గత ఐదేళ్లుగా మీడియా ముందుకు రాడు.. బయటకు వచ్చి మాట్లాడేందుకు భయపడుతున్నాడు అని పెద్దపెద్ద మాటలు చెప్పారు. ప్రజల్లోకి విమర్శలు తీసుకెళ్లారు. అయితే ఇప్పుడు వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే గత ప్రభుత్వం చేసిన ప్రయోజనాలు, ఇప్పుడు జరుగుతున్న అన్యాయంపై గణాంకాలతో సహా తెలియజేస్తున్నారు. అప్పటి ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి మధ్య తేడాను తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
నరం లేని నాలుక మాదిరిగా రాజకీయ నేతలు మాట్లాడడం పరిపాటిగా వస్తోంది. గతంలో జగన్మోహన్ రెడ్డి పై అదే తరహా ఆరోపణలు చేసి ప్రజల్లో చులకన చేశారు. 2019లో అధికారంలోకి వచ్చింది మొదలు.. 2024 మార్చి వరకు నిరాటంకంగా పథకాలను అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి. కానీ వాటిని చెప్పుకునే ప్రయత్నంలో విఫలమయ్యారు.
ఆల్మోస్ట్ సంక్షేమ పథకాలను అమలు చేసి చూపించారు. తాను హామీ ఇవ్వని హామీలను సైతం అమలు చేయగలిగారు. అలా అమలు చేసిన పథకాలను ప్రజలకు చెప్పలేకపోయారు. అయితే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఆయన వ్యవహార శైలి మారింది. ప్రతి అంశం పైన శోధించి.. గణాంకాలు తయారు చేయించి మరి ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఒక ప్రెస్ మీట్ కు రెండు రోజులపాటు సిబ్బంది తమ సమయాన్ని కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రయత్నం అధికారంలో ఉండేటప్పుడు చేసి ఉంటే బాగుండేది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం ఉన్నట్లు ఉందని ఎద్దేవా చేస్తున్నవారు కూడా ఉన్నారు. అయితే మున్ముందు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో?