Sunday, March 16, 2025

ఆ 50 నియోజకవర్గాలపై జగన్మోహన్ రెడ్డి ఫుల్ ఫోకస్!

- Advertisement -

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఎన్నికల్లో ఓటమితో ఆ పార్టీ శ్రేణులు డీలా పడ్డారు. కానీ అధినేత జగన్మోహన్ రెడ్డి ధైర్యం పోగుచేసుకుని బయటకు వచ్చారు. పార్టీ శ్రేణులకు కీలక సందేశాలు ఇస్తున్నారు. పార్టీలో యాక్టివ్ కావాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. అవసరం అయితే ద్వితీయ శ్రేణి నాయకత్వానికి నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తానని కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే కీలక నియోజకవర్గాల్లో మార్పులు చేసి చూపించారు. ఇప్పుడు మరోసారి ఫుల్ ఫోకస్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి.

ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు దీవెనల చెల్లింపులు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 12న రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాట పట్టింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పక్కన పెట్టి మరి విద్యార్థుల కోసం పోరాటం చేసింది. అయితే ఈ పోరాటం జిల్లా కేంద్రాలకే పరిమితం అయ్యిందన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా కొంతమంది నియోజకవర్గ ఇన్చార్జిలు తూతూ మంత్రంగా జరిపారన్నది జగన్మోహన్ రెడ్డికి వచ్చిన సమాచారం. దీంతో రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గ సమాచారాన్ని తెప్పించుకునే పనిలో పడ్డారు జగన్మోహన్ రెడ్డి.

ఉగాది నుంచి ప్రజల్లోకి రావాలని జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రూపొందిస్తున్నారు. కానీ చాలా నియోజకవర్గాల్లో ఇన్చార్జులు మాత్రం ఇంకా యాక్టివ్ లోకి రాలేదు. చాలామంది సీనియర్లు సైతం తమ నియోజకవర్గాలను పట్టకుండా వ్యవహరిస్తున్నారు. కేవలం పరామర్శలకి పరిమితం అవుతున్నారు. అయితే తాజాగా చేపట్టిన పోరుబాటకు సీనియర్లు చాలామంది గైర్హాజరైనట్లు తెలుస్తోంది. అయితే వారికి చివరి వార్నింగ్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం.

ఓటమి నుంచి చాలామంది నేతలు తేరుకున్నారు. అయితే అధికార పార్టీతో ఒప్పందాలు చేసుకున్న కొందరు పార్టీలో యాక్టివ్ గా లేరు. మరికొందరు ఎన్నికల సమీపంలో చూసుకుందాంలే అన్న రీతిలో ఉన్నారు. అటువంటి వారి వివరాలను సేకరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అటువంటి వారి స్థానంలో కొత్తవారిని నియమించేందుకు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాలకు గాను.. ఓ 50 నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిలు సరిగ్గా వ్యవహరించడం లేదన్న టాక్ ఉంది. అసలు తాము నియోజకవర్గ ఇన్చార్జిలం అన్న మాట మరిచిపోయినట్టు ఉన్నారు. కొంతమంది నగరాల్లో ఉంటున్నారు. మరికొందరు విదేశాల్లో గడుపుతున్నారు. వారందరికీ స్వీట్ వార్నింగ్ ఇవ్వనున్నారు జగన్మోహన్ రెడ్డి.

ఉగాది నాటికి ఆ 50 నియోజకవర్గాలను సెట్ చేయాలన్న ఆలోచనతో కసరత్తు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. చేస్తే యాక్టివ్ గా పని చేయండి.. లేకుంటే గౌరవంగా తప్పుకోండి అంటూ అధినేత నుంచి వారికి సమాచారం వెళుతున్నట్లు తెలుస్తోంది. అయితే వారు యాక్టివ్ అయితే పర్వాలేదు.. లేకుంటే మాత్రం మార్పుకు శ్రీకారం చుట్టనున్నారు జగన్మోహన్ రెడ్డి. అవసరం అనుకుంటే పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకుడికి బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నట్లు సమాచారం. చూడాలి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!