Wednesday, March 19, 2025

రెడ్ బుక్ లో నెక్స్ట్ వారే.. శాసనసభ వేదికగా వెల్లడి!

- Advertisement -

ఏపీలో రెడ్ బుక్ సంస్కృతి నడుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను టార్గెట్ చేసుకుంది కూటమి ప్రభుత్వం. అరెస్టులు చేస్తోంది. కేసుల మీద కేసులు పెడుతోంది. తొలుత వల్లభనేని వంశీని అరెస్టు చేసింది. బెయిల్ రాకుండా కేసుల మీద కేసులు పెడుతోంది. అటు తరువాత పోసాని కృష్ణ మురళి అరెస్టు జరిగింది. ఆయనపై సైతం కేసుల పర్వం నడుస్తోంది. కోర్టుల నుంచి బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపుతోంది.

మరోవైపు ప్రాధాన్యత క్రమంలో మిగతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై సైతం కేసులతో ఉక్కు పాదం మోపాలని భావిస్తోంది. తన జీవితంలో కక్ష సాధింపులు లేవని చెబుతున్నారు సీఎం చంద్రబాబు. కానీ అరెస్టుల పర్వం చూస్తుంటే మాత్రం లోకేష్ రాసిన రెడ్ బుక్కు గుర్తుకొస్తోంది. తండ్రి కొడుకులు పరస్పరమైన విరుద్ధ ప్రకటనలతో ముందుకెళ్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కన్ఫ్యూజ్ చేస్తున్నారు.

మరోవైపు శాసనసభలో మంత్రుల ప్రకటన చూస్తే ఒక పద్ధతి ప్రకారం అరెస్టులు చేయాలని ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆడుదాం ఆంధ్రాలో మంత్రి రోజా అవినీతికి పాల్పడ్డారని ఒకరు.. ఆంధ్ర యూనివర్సిటీలో వైస్ ఛాన్స్లర్ ప్రసాద్ రెడ్డి అవినీతి చేశారని ఇంకొకరు.. గుడివాడ కేంద్రంగా కొడాలి నాని దోపిడీకి పాల్పడ్డారని మరొకరు.. నెల్లూరు జిల్లాను దోచుకున్నారని కాకాని గోవర్ధన్ రెడ్డి పై ఆరోపణలు చేస్తూ మరొకరు ఇలా.. వరుసగా హింటులు ఇస్తున్నారు.

అయితే ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ గా పనిచేసిన ప్రసాద్ రెడ్డి పై దృష్టి పెట్టారు కూటమి. ఈయన జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గర వ్యక్తి. అందుకే టిడిపి తో పాటు జనసేన నేతలు టార్గెట్ చేసుకున్నారు. విమర్శలు కూడా చేశారు. అయినా ఆయన ఖాతరు చేయలేదు. ఇప్పుడు అదే ప్రసాద్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని కోరుతూ విశాఖకు చెందిన టిడిపి ఎమ్మెల్యేలు కోరారు. దీంతో నారా లోకేష్ విచారణకు ఆదేశించారు.

మాజీ మంత్రి కొడాలి నాని విషయంలో ఒక పద్ధతి ప్రకారం విచారణ ముందుకు సాగుతున్నట్లు సమాచారం. సరైన ఆధారాలు సేకరించి.. వరుస పెట్టి కేసులు పెట్టి.. ఆయనకు బెయిల్ రాకుండా చేయాలన్నది ప్లాన్ గా తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో కఠిన కేసులతో కొడాలి నాని పై ఉక్కు పాదం మోపాలన్నది ప్లాన్ గా సమాచారం.

నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పై సైతం కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు చాలా రకాల ఆరోపణలు వచ్చాయి. అందుకే వాటన్నింటిపై విచారణ జరిపి అదుపులోకి తీసుకోవాలన్నది కూటమి ప్లాన్ గా తెలుస్తోంది. మొత్తానికి అయితే రెడ్ బుక్కులో ఒక్కొక్క పేరు బయటపడుతోంది. అది కూడా శాసనసభ వేదికగా బయటపడుతుండడం విశేషం.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!