తెలుగుదేశం పార్టీకి జీవీ రెడ్డి రాజీనామా సంచలనం రేపింది. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా ఉన్న జీవి రెడ్డి రెండు రోజుల కిందట తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసింది. టిడిపి పదవులతో పాటు పార్టీ సభ్యత్వానికి సైతం రాజీనామా ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక రాజకీయాలు చేయనని.. ఏ రాజకీయ పార్టీలో చేరనని ప్రకటించారు. కానీ ఆయన త్వరలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం నడుస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు జీవి రెడ్డి. స్వతహాగా న్యాయవాది. మంచి వాగ్దాటి ఉన్న నేత. సమకాలీన రాజకీయ అంశాలపై అవగాహన ఉన్న వ్యక్తి. 2019లో తెలుగుదేశం పార్టీ దారుణ పరాజయం చవిచూసింది. ఆ సమయంలో టిడిపి నుంచి పెద్ద ఎత్తున నేతలు బయటకు వెళ్లిపోయారు. అటువంటి సమయంలో నేనున్నాను అంటూ ముందుకు వచ్చారు జీవి రెడ్డి. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ పార్టీ అఫీషియల్ స్పోకెన్ గా మారారు. అధికార ప్రతినిధిగా నియమితులై పార్టీ వాయిస్ను గట్టిగానే వినిపించారు. టీవీ డిబేట్లో సైతం పాల్గొనేవారు. చంద్రబాబు నాయకత్వాన్ని బలపరిచేవారు. అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు జీవీ రెడ్డికి కీలకమైన ఫైబర్ నెట్ చైర్మన్ పదవి అప్పగించారు.
అయితే ఫైబర్ నెట్ లో సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు జీవి రెడ్డి. ఈ క్రమంలో అవినీతిని అరికట్టాలని భావించారు. దీనికి ఫైబర్ నెట్ ఎండి అడ్డు తగులుతుండడంతో.. అదే విషయాన్ని చంద్రబాబుకు పలుమార్లు చెప్పారు. అయితే చూసి చూడనట్టుగా వెళ్లాలని.. ఇలా చేస్తే కుదరదని చంద్రబాబు జీవీ రెడ్డికి తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇటీవల ఫైబర్ నెట్ లో పతాక స్థాయిలో విభేదాలు తలెత్తాయి. అయితే చంద్రబాబు ఫైబర్ నెట్ ఎండి దినేష్ కుమార్ ను సమర్ధించారు. జీవి రెడ్డి తీరును తప్పు పట్టారు. అందుకే మనస్థాపానికి గురైన జీవి రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.
అయితే తెర వెనుక జీవి రెడ్డి ఎపిసోడ్లో చాలా రకాల పరిణామాలు చోటు చేసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. నామినేటెడ్ పదవుల్లో ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవి ఎంతో కీలకం. అటువంటి పదవిని కమ్మ సామాజిక వర్గం నేతలు కోరుకున్నారు. కానీ చంద్రబాబు జీవీ రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. దీనిని చాలామంది తట్టుకోలేక పోయారు. అందుకే తెర వెనుక మంత్రాంగం నడిపినట్లు ప్రచారం నడుస్తోంది. చంద్రబాబు తప్పు పట్టడం అందులో భాగమేనని సమాచారం. అయితే తెర వెనుక విషయాన్ని గ్రహించిన జీవి రెడ్డి పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
అయితే తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో జీవీ రెడ్డి ఆ పార్టీలో చేరారు. కానీ ఆ పార్టీ సముచిత స్థానం ఇవ్వలేదు. ప్రస్తుతం ఘోరంగా అవమానించింది. అందుకే పగ తీర్చుకోవాలని జీవి రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. కనీసం రాజీనామా చేసిన తర్వాత కూడా చంద్రబాబు పిలిచి మాట్లాడలేదని.. వెంటనే రాజీనామాను ఆమోదించడం వెనుక కుట్ర ఉందని జీవి రెడ్డి అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి తన ప్రతాపం చూపనున్నట్లు సమాచారం. అదే జరిగితే తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలినట్లే.