ఆయన సీనియర్ నేత. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ వచ్చారు. అధినేత కష్టకాలంలో ఉంటే అన్నీ తానై నిలబడ్డారు. అటువంటి నేత ఇప్పుడు పొలిటికల్ రిటైర్మెంట్ ముందు నిలబడ్డారు. గౌరవప్రదమైన పదవీ విరమణ చేయాలనుకుంటున్నారు. కానీ పార్టీలో ఆ పరిస్థితి లేదు. ఆ సీనియర్ నేతను దాదాపు పక్కన పెట్టినట్టేనని ప్రచారం నడుస్తోంది. ఇంతకీ ఎవరు అనేత? ఏంటా కథ? అంటే ఈ స్టోరీ చూసేయాల్సిందే.
తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన చాలామంది నేతలు రాజకీయాల్లో రాణించారు. దశాబ్దాలుగా ఉనికి చాటుకుంటూ వచ్చారు. అటువంటి నేతల్లో యనమల రామకృష్ణుడు ఒకరు. తూర్పుగోదావరి జిల్లా తుని నుంచి సుదీర్ఘకాలం శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తన సత్తా చాటుకుంటూ వస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతిసారి మంత్రి పదవి దక్కించుకుంటూ వచ్చారు. అటువంటి సీనియర్ నేత ఇప్పుడు పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది.
1983లో తెలుగుదేశం పార్టీలో చేరారు యనమల రామకృష్ణుడు. విద్యాధికుడు కూడా. సమకాలిన రాజకీయ అంశాలపై అవగాహన అధికం. దీంతో ఎన్టీఆర్ తన తొలి మంత్రివర్గంలో యనమల రామకృష్ణుడు కు చాన్స్ ఇచ్చారు. 1983 నుంచి 1999 వరకు ఎమ్మెల్యేగా కొనసాగిన ఆయన.. 2004లో మాత్రం ఓడిపోయారు. అయితే తెలుగుదేశం నాయకత్వం ఆయనకు 12 సంవత్సరాలుగా ఎమ్మెల్సీ పదవీస్తూ వచ్చింది. కానీ ఈసారి ఆయనకు పదవి డౌటే. గత కొంతకాలంగా చంద్రబాబుతో ఆయనకు గ్యాప్ ఏర్పడినట్లు ప్రచారం నడుస్తోంది. దీంతో ఆయనకు పదవి ఇచ్చే ఛాన్స్ లేదని టాక్ ఉంది.
ఈసారి ఎన్నికల్లో యనమల రామకృష్ణుడు పోటీ నుంచి తప్పుకున్నారు. కుమార్ దివ్య కు అవకాశం ఇచ్చారు. అయితే తనకు మరోసారి ఎమ్మెల్సీ పదవిని రెన్యువల్ చేసి మంత్రిని చేయాలని యనమల రామకృష్ణుడు కోరారు. అందుకు నాయకత్వం అంగీకరించకపోవడంతోనే ఇటీవల కాకినాడ పోర్టు విషయంలో పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకనపెట్టేలా లేఖ రాశారు. దీంతో హై కమాండ్ యనమల రామకృష్ణుడు పై సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. అటు యువనేత నారా లోకేష్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యనమల రామకృష్ణుడుకు అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.