Sunday, March 16, 2025

ఆ ఇద్దరు నేతలకు చంద్రబాబు హ్యాండ్ ఇస్తారా? వర్మ, ఉమా భవితవ్యం ఏంటి?

- Advertisement -

తెలుగుదేశం పార్టీలో తిరుగుబాటు తప్పదా? ఆ ఇద్దరు నేతల మౌనం దేనికి సంకేతం? ఈసారైనా చంద్రబాబు పరిగణలోకి తీసుకుంటారా? లేకుంటే సమీకరణలు పేరు చెప్పి పక్కకు తప్పిస్తారా?.. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. ఎమ్మెల్యేల కోటా కింద ఐదుగురు ఎమ్మెల్సీల ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ వెల్లడించింది. యనమల రామకృష్ణుడు, దువ్వారపు రామారావు, తిరుమల నాయుడు, పరుచూరి అశోక్ బాబు, జంగా కృష్ణమూర్తిల ఎమ్మెల్సీ పదవీకాలం మార్చి 31తో ముగియనుంది. అందుకే వారి స్థానంలో కొత్తవారిని ఎంపిక చేసేందుకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. మార్చి 20న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరగనుంది. అయితే కూటమి బలంగా ఉండడంతో.. 5 ఎమ్మెల్సీ సీట్లు కూటమికి దక్కే అవకాశం ఉంది.

అయితే 5 ఎమ్మెల్సీ సీట్లలో మెగా బ్రదర్ నాగబాబుకు ఒకటి కచ్చితంగా దక్కనుంది. ఇప్పటికే ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసింది. మంత్రి కావాలంటే తప్పనిసరిగా చట్టసభలకు ఎన్నిక కావాలి. అందుకే ఆయనకు ఒక ఎమ్మెల్సీ పదవి ఖాయం. ఇక మిగిలినవి నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు. అందులో టిడిపికి ఎన్ని? జనసేనకు ఎన్ని? బిజెపికి ఎన్ని? అనేది స్పష్టత రావాల్సి ఉంది.

జనసేన కోటాకు సంబంధించి నాగబాబుకు కేటాయిస్తారు. అయితే జనసేన మరో పదవి కోరుతుందా? లేకుంటే బిజెపికి కేటాయించి.. మిగతా మూడు సీట్లు టిడిపి తీసుకుంటుందా? అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు తెలుగుదేశం పార్టీలో సీట్లు త్యాగం చేసిన నేతలు చాలామంది ఉన్నారు. అందులో ఇద్దరూ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం సీటును త్యాగం చేశారు వర్మ. గత ఐదేళ్లలో పిఠాపురంలో తెలుగుదేశం అభివృద్ధికి చాలా కృషి చేశారు. పార్టీ గెలుస్తుందన్న నమ్మకం ఉన్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటిగా తీర్చిదిద్దారు. కానీ సరిగ్గా ఎన్నికలకు ముందు ఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. దీంతో చంద్రబాబు సూచన మేరకు వర్మ పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. అయితే నీ త్యాగం ఊరికే పోదని.. కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఎమ్మెల్సీ పదవి కేటాయిస్తామని చంద్రబాబు అప్పట్లో హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ అమలుకు నోచుకోలేదు. అయితే ఈసారైనా తప్పకుండా అవకాశం దక్కుతుందని వర్మ భావిస్తున్నారు. అయితే పిఠాపురంలో అధికార కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే అక్కడ మరింత విభేదాలు పెరిగే అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు ఈసారి కూడా మొండి చేయి చూపుతారని ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే వర్మ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

తెలుగుదేశం పార్టీలో చివరి నిమిషంలో సీటు త్యాగం చేసిన వారిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఒకరు. మైలవరం నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్ కోసం సీటు త్యాగం చేశారు దేవినేని ఉమ. గత ఐదేళ్లుగా పార్టీ అభివృద్ధికి పాటుపడ్డారు ఉమా. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన తన ప్రత్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ కోసం త్యాగం చేయాల్సి వచ్చింది. అయితే అప్పట్లోనే చంద్రబాబు బాహటంగానే ప్రకటించారు. దేవినేని ఉమా త్యాగం చేశారని.. తాను న్యాయం చేస్తానని అప్పట్లో బహిరంగంగానే చెప్పుకొచ్చారు. అయితే ఇంతవరకు ఉమాకు ఛాన్స్ దక్కలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఆయనకు కేటాయిస్తారని ప్రచారం నడుస్తోంది. అయితే గతంలో కూడా ఇలానే వార్తలు నడిచాయి. కానీ చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చారు చంద్రబాబు. అయితే గత కొంతకాలంగా ఉమా పొలిటికల్ గా సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు గాని చంద్రబాబు మరోసారి హ్యాండ్ ఇస్తే కీలక నిర్ణయం దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!