Wednesday, March 19, 2025

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జోగి రమేష్ కలకలం!

- Advertisement -

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది పదవులు అనుభవించారు. అర్హత లేని వారికి సైతం అందలం ఎక్కించారు జగన్మోహన్ రెడ్డి. కేవలం విధేయతకు పట్టం కట్టి చాలామందికి పదవులు ఇచ్చారు. అందులో మాజీ మంత్రి జోగి రమేష్ ఒకరు. ఎక్కడో వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకుడిగా ఉన్న రమేష్ ను పిలిచి మరి టిక్కెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. నియోజకవర్గాలను మార్చి మరి అవకాశాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరం కావడంతో.. జోగి రమేష్ లాంటి నేతలు పక్క చూపులు చూస్తున్నారు. పార్టీ కష్ట కాలంలో ఉంటే పట్టించుకోవడం లేదు. కృష్ణాజిల్లాలో సహచర నేత వల్లభనేని వంశీ అరెస్టు జరిగినా స్పందించలేదు. అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సైతం ముఖం చాటేసారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక రకమైన ఆగ్రహం కనిపిస్తోంది.

గత కొద్దిరోజులుగా ఆయన చర్యలు అభ్యంతర కరంగా ఉన్నాయి. ఓడిపోయిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు తెగ ప్రయత్నాలు చేశారట. తెలుగుదేశం నేతలతో వేదికలు పంచుకున్నారు కూడా. అయితే జోగి రమేష్ గత వ్యవహార శైలితో తెలుగుదేశం పార్టీ నాయకత్వం సైతం ఆయన విషయంలో ఆసక్తి చూపలేదట. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఆయన కొనసాగాలనుకుంటున్నారట.

కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు జోగి రమేష్. యువజన కాంగ్రెస్లో తన ప్రస్తానాన్ని ప్రారంభించారు. కృష్ణాజిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, రైల్వే బోర్డు మెంబర్గా, ఆర్టీసీ జోనల్ చైర్మన్గా వివిధ హోదాల్లో పనిచేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు వేశారు జోగి రమేష్. 2014 ఎన్నికల్లో మైలవరం నుంచి ఛాన్స్ ఇచ్చారు జగన్. అయినా ఓడిపోయారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించారు. 2019 ఎన్నికల్లో పెడన నియోజకవర్గం నుంచి అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్యేగా గెలవడంతో రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయన పనితీరు బాగా లేకపోవడంతో పెడన నుంచి పెనమలూరు మార్చారు. పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారు. అయినా ఆయనకు ఓటమి తప్పలేదు.

గత కొద్దిరోజులుగా వేరే పార్టీలోకి వెళ్లాలని భావించిన జోగి రమేష్ కు అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలని భావిస్తున్న ఆయన పెడనపై దృష్టి పెట్టారు. వదుల సంఖ్యలో కార్లతో భారీ కాన్వాయి గా పెడన నియోజకవర్గం లో అడుగు పెట్టారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన ఆందోళన కనిపించింది. జోగి రమేష్ రాకతో ఇబ్బందికర పరిస్థితులు తప్పవని తెలుస్తోంది. ఈ తరుణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సీరియస్ యాక్షన్ కు దిగే అవకాశం ఉంది. జోగి రమేష్ లాంటి నేతలకు అవకాశం ఇవ్వద్దని జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాయి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!