తెలుగుదేశం పార్టీకి పట్టున్న జిల్లాల్లో శ్రీకాకుళం ఒకటి. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ గట్టి ముద్ర చాటుకుంటూ వస్తోంది ఆ పార్టీ. 2019లో జగన్ ప్రభంజనంలో సైతం తట్టుకొని రెండు స్థానాలతో నిలబడింది. ఈ ఎన్నికల్లో ఏకంగా అన్ని అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుంది. కనివిని ఎరుగని విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే అటువంటి జిల్లాలో తెలుగుదేశం పార్టీలో విభేదాలు ప్రారంభమైనట్లు ప్రచారం నడుస్తోంది. గతంలో ఇక్కడ కింజరాపు వర్సెస్ కిమిడి ఫ్యామిలీ అన్నట్టు ఉండేది పరిస్థితి. ఆ రెండు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో పై చేయి సాధించేందుకు సై అంటే సై అన్న విధంగా ఉండేవి. ముఖ్యంగా కింజరాపు ఎర్రం నాయుడుతో సుదీర్ఘకాలం విభేదిస్తూ వచ్చారు కళా వెంకట్రావు. చంద్రబాబు ఎర్రం నాయుడుకి ఎనలేని ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రజారాజ్యం పార్టీలో చేరిపోయారు కళా వెంకట్రావు. మారిన పరిస్థితుల నేపథ్యంలో కళా వెంకట్రావు తిరిగి టిడిపిలో చేరారు. అటు తరువాత అచ్చం నాయుడు వర్సెస్ కళా వెంకట్రావు అన్నట్టు పరిస్థితి ఉండేది. అయితే ఈ ఎన్నికల్లో కళా వెంకట్రావును విజయనగరం జిల్లాకు షిఫ్ట్ చేశారు చంద్రబాబు. దీంతో విభేదాలు సమసి పోయాయని అంతా భావించారు. కానీ ఇప్పుడు కూన రవికుమార్ రూపంలో కింజరాపు కుటుంబానికి వ్యతిరేక వర్గం పుట్టుకొచ్చినట్లు ప్రచారం నడుస్తోంది.
బలమైన కాళింగ సామాజిక వర్గానికి చెందినవారు కూన రవికుమార్. ఈ ఎన్నికల్లో స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం ను ఓడించారు. దీంతో ఆయనకు తప్పకుండా మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించారు. కానీ చివరి నిమిషంలో తనకు మంత్రి పదవి రాకుండా అచ్చం నాయుడు అడ్డుకున్నారు అని రవికుమార్ లో తీవ్ర అసంతృప్తి ఉంది. పైగా ఒకే ఇంట్లో కేంద్రమంత్రి తో పాటు రాష్ట్ర క్యాబినెట్లో చోటు ఇవ్వడంపై రవికుమార్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం నడిచింది. ఆ మధ్యన ప్రభుత్వ విప్ పదవి ఇస్తే తిరస్కరించారు రవికుమార్. తనకు ఉన్న పోలీసు భద్రతను సైతం వదులుకున్నారు. కొద్దిరోజుల పాటు అసంతృప్తితో గడిపారు. అసెంబ్లీలో ఏకంగా మంత్రుల తీరుపై ధ్వజమెత్తారు కూన రవికుమార్.
అయితే రవికుమార్ ఆగ్రహాన్ని గమనించిన సీఎం చంద్రబాబు సముదాయించే ప్రయత్నం చేశారు. శాంతింప చేశారు. ఈ క్రమంలో కీలక పదవి కట్టబెట్టారు. పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ.. పియుసి చైర్మన్ గా అవకాశం ఇచ్చారు. దాదాపు 52 ప్రభుత్వ రంగ సంస్థలపై చైర్మన్ కు అజమాయిసి ఉంటుంది. ఈ పదవి అత్యంత కీలకం కావడంతో తన సత్తా చాటుతున్నారు రవికుమార్. ఈ క్రమంలో జిల్లాలో కింజరాపు కుటుంబం పై గట్టి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
తన మంత్రి పదవికి అడ్డగించిన కింజరాపు కుటుంబం పై ఎలాగైనా తీర్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం పరిధిలో ఆముదాల వలస నియోజకవర్గం ఉంటుంది. ఎంపీగా రామ్మోహన్ నాయుడు మూడోసారి గెలిచారు. అయితే రామ్మోహన్ నాయుడు విషయంలో సాఫ్ట్ కార్నర్ తో ఉన్నారు రవికుమార్. కానీ అచ్చం నాయుడు విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదని భావిస్తున్నారు. తనకున్న పదవి ద్వారా జిల్లాలో పట్టు సాధించాలని చూస్తున్నారు. మంత్రికి వ్యతిరేకంగా ఒక వర్గం తయారు చేసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే కాలింగ సామాజిక వర్గమంతా ఏకతాటిపైకి వచ్చి కూన రవి కుమార్ వెంట నడిచినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే కళా వెంకట్రావు ఖాళీ చేసిన ప్లేస్ రవికుమార్ భర్తీ చేసినట్లు అయింది. మున్ముందు కూన వర్సెస్ కింజరాపు అన్నట్టు ఉండనుంది సిక్కోలు జిల్లా రాజకీయం.