కావలి గ్రీష్మ ప్రసాద్.. టిడిపి తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు ఈమెను. సీనియర్ నాయకురాలు ప్రతిభా భారతి కుమార్తె ఈమె. అయితే ప్రతిభా భారతి వారసురాలిగా చట్టసభల్లో అడుగు పెట్టాలని గ్రిష్మ ప్రసాద్ గట్టిగానే అడుగులు వేశారు. కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో ఆమెకు చాన్స్ ఇవ్వలేదు చంద్రబాబు. కానీ ఇప్పుడు ఉన్నఫలంగా తెరపైకి తెచ్చారు. ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. దీంతో ఆమె ఎంపికపై తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఒక రకమైన చర్చ నడుస్తోంది.
కావలి ప్రతిభా భారతి తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్. 1983లో తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి ఎన్నికల్లోనే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఎచ్చెర్ల నుంచి బరిలో దిగారు ప్రతిభా భారతి. ఉమ్మడి రాష్ట్రంలోనే తొలి ఫలితం ఆమెది. అదే సెంటిమెంట్ తో 27 ఏళ్లకే ఎన్టీఆర్ ప్రభుత్వంలో క్యాబినెట్ మినిస్టర్ పొందారు ప్రతిభా భారతి. అది మొదలు 1999 ఎన్నికల వరకు ఆమె వెనుదిరిగి చూడలేదు.
అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎంట్రీ తో ఉమ్మడి రాష్ట్రంలో సీన్ మారింది. ప్రతిభా భారతి లాంటి నేతలు సామాన్యుల చేతిలో ఓడిపోయారు. అలా వచ్చిన వాడే కోండ్రు మురళీమోహన్. 2004 ఎన్నికల్లో కోండ్రు మురళీమోహన్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆ ఎన్నికల్లో ప్రతిభా భారతి ఓడించారు మురళీమోహన్. 2009లోనూ అదే సీన్.
అయితే నియోజకవర్గాల పునర్విభజనతో ఎచ్చెర్ల నియోజకవర్గం జనరల్ గా మారింది. అప్పటివరకు జనరల్ గా ఉనుకూరు నియోజకవర్గం స్థానంలో రాజాం నియోజకవర్గం వచ్చింది. ఎస్సీలకు రిజర్వ్ అయింది. 2009లో రాజాం నియోజకవర్గానికి కోండ్రు మురళీమోహన్ తో పాటు ప్రతిభా భారతి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. కానీ సీనియర్ అయినా ప్రతిభా భారతిని ఓడించారు కోండ్రు మురళీమోహన్. కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో కోండ్రు మురళీమోహన్ తో పాటు ప్రతిభా భారతి కొట్టుకుపోయారు. 2014 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కంబాల జోగులు ప్రతిభా భారతి పై విజయం సాధించారు. కోండ్రు మురళీమోహన్ మూడో స్థానానికి పరిమితం అయ్యారు. అయితే టిడిపి అధికారంలోకి రావడంతో ప్రతిభా భారతి ఎమ్మెల్సీ అయ్యారు. కానీ 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి కోండ్రు టిడిపిలో చేరారు. దీంతో ప్రతిభాభారతిని సైడ్ చేసి కొండ్రుకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు. అయినా సరే ఫలితం లేకుండా పోయింది. కోండ్రు మురళీమోహన్ ఓడిపోయారు.
అయితే 2024 ఎన్నికల్లో మరోసారి టిడిపి అభ్యర్థిగా బరిలో దిగారు కోండ్రు మురళీమోహన్. అయితే అభ్యర్థిత్వాన్ని ఆశించారు ప్రతిభాభారతి కుమార్తె గ్రీష్మ ప్రసాద్. కానీ లోకేష్ మాత్రం కోండ్రు మురళీమోహన్ కు అవకాశం ఇచ్చారు. అయితే రిజర్వుడు నియోజకవర్గం అయినా ఇక్కడ కళా వెంకట్రావు ప్రాబల్యం ఎక్కువ. కోండ్రు మురళీమోహన్ ను ఎలాగైనా దెబ్బతీయాలని కళా వెంకట్రావు భావించారు. అందుకు ప్రతిభా భారతి కుటుంబాన్ని వాడుకున్నారు. అయితే కూటమి ప్రభంజనంలో కొండ్రు అనూహ్యవిజయం సాధించారు. ఇది ఏ మాత్రం మింగుడు పడలేదు కళా వెంకట్రావుకు.
అందుకే కోండ్రు మురళీమోహన్ ఆధిపత్యాన్ని చెప్పేందుకు గ్రీష్మ ప్రసాద్ ను ప్రయోగించారు. ఎమ్మెల్సీగా తెర వెనుక తెరపైకి తెచ్చి అవకాశం కల్పించారు. లోకేష్ గట్టిగా సమర్ధించడంతో గ్రీష్మ ప్రసాద్ కు ఛాన్స్ దక్కింది. గతంలో మహానాడు వేదికగా నాటి సీఎం జగన్మోహన్ రెడ్డికి తొడగొట్టి సవాల్ చేశారు గ్రీష్మ ప్రసాద్. అందుకే మండలిలో గ్రీష్మ ప్రసాద్ లాంటి నేత అవసరం అని భావించారు లోకేష్. ఎస్సీ సామాజిక వర్గంతో పాటు మహిళా కోటా కింద గ్రీష్మ ప్రసాద్ కు అవకాశం దక్కింది. అయితే ఇక నుంచి రాజాం నియోజకవర్గ పరిస్థితి మారనుంది. కచ్చితంగా అక్కడ ప్రతిభా భారతి వర్గం మళ్లీ యాక్టివ్ అవుతుంది. దానికి కళా వర్గం తోడవుతుంది. ఈ మొత్తం పరిణామాలు మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ కు చెక్ చెప్పేందుకేనని టాక్ వినిపిస్తోంది.