కూటమి మైండ్ గేమ్ ఆడుతోంది. దానిని గుర్తించలేకపోతోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ ల విషయంలో సరిగ్గా అంచనాలు వేయలేకపోతోంది. వారిద్దరి మధ్య విభేదాలు వస్తాయని ఆశిస్తోంది. వారు కూడా తమ మధ్య గ్యాప్ ఉన్నట్టు వ్యవహరిస్తున్నారు. మళ్లీ కలిసి పోతున్నారు. అయితే అదంతా పొలిటికల్ అడ్జస్టెన్సీ అని.. డైవర్షన్ పాలిటిక్స్ అని అర్థం చేసుకోలేకపోతోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.
చంద్రబాబు, పవన్ ల మధ్య గట్టి బంధం ఉంది. దాని ఫలితంగానే ఆ ఇద్దరు కలిశారు. బిజెపిని తమతో కలుపుకున్నారు. కూటమి కట్టి అధికారంలోకి రాగలిగారు. జగన్మోహన్ రెడ్డిని మరోసారి అధికారంలోకి రానివ్వకూడదని బలంగా నిర్ణయించుకున్నారు. కానీ ఇది తెలియని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎంతవరకు ఆ రెండు పార్టీల మధ్య విభేదాలు వస్తాయి.. తాము గట్టెక్కి పోతాము అని భావిస్తున్నారు.
నారా లోకేష్ ప్రమోషన్ విషయంలోనే ఒక వ్యూహం ప్రకారం ఆ రెండు పార్టీలు నడుచుకున్నాయని విశ్లేషణలు ఉన్నాయి. ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా నారా లోకేష్ కావాలని టిడిపి నేతలు కోరుకున్నారు. వెంటనే జనసేన నేతలు ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలని ఉందని అభిప్రాయపడ్డారు. దీంతో రెండు పార్టీల మధ్య ఒక రకమైన గ్యాప్ ఏర్పడింది. ఆ సమయంలో ఎవరికి వారుగా వ్యవహరించారు. అదే సమయంలో ఒక్కటి గమనించాలి. ప్రభుత్వ వైఫల్యాలు పక్కకు వెళ్లిపోయాయి. కూటమి రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత దక్కింది.
రాష్ట్ర మంత్రివర్గంలో ఒక మంత్రి పదవిని ఖాళీగా ఉంచారు. ఎవరికి వారుగా దానిని అన్వయించుకున్నారు. పిఠాపురం వర్మకు అని ఒకరు.. కాదు కాదు వంగవీటి రాధాకృష్ణ కోసమని మరొకరు.. బిజెపి కోసమని ఇంకొకరు.. ఇలా ఎవరికి వారు విశ్లేషణలు చేశారు. కానీ అది నాగబాబు కోసం అని ఎవరు గుర్తించలేకపోయారు.
ఈ ఎన్నికల్లో కూటమి గెలుపునకు ప్రధాన కారకులు పవన్ కళ్యాణ్. కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు మూడు పార్టీలను కలిపిన ఘనత మాత్రం ఆయనదే. అయితే పొత్తులో భాగంగా 50,60 సీట్లు తీసుకుంటారని అంతా భావించారు. తీసుకోవాలని చాలామంది సలహా ఇచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ కేవలం 21 అసెంబ్లీ సీట్లు మాత్రమే తీసుకున్నారు. రెండు పార్లమెంట్ స్థానాలను మాత్రమే కోరుకున్నారు.
ఆది నుంచి చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. క్యాబినెట్ కూర్పు సమయంలో ఒక మంత్రి పదవి వదిలారు. కానీ అది నాగబాబు కోసమేనని చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు మాత్రమే తెలుసు. కానీ దానిని అంచనా వేయలేక పోయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు ముగ్గురు రాజ్యసభ సభ్యులు. వాటిని భర్తీ చేసే క్రమంలో నాగబాబు పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే చివరి నిమిషంలో ఆయనకు చాన్స్ దక్కలేదు. కానీ ఆయనకు మంత్రి పదవి ఇస్తామని సీఎం చంద్రబాబు నేరుగా ప్రకటించేశారు. అంటే అక్కడ ఒక సీన్ క్రియేట్ చేశారన్నమాట.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో ఉన్నారు. ఆ పార్టీకి చెందిన మరో ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. నేరుగా నాగబాబును క్యాబినెట్ లోకి తీసుకుంటే అనేక రకాల అభ్యంతరాలు వచ్చేవి. అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది తరువాత నాగబాబును మంత్రి చేయాలన్నది ఆ ఇద్దరు నేతలు ప్లాన్. అయితే అది నేరుగా చేస్తే కూటమి పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వస్తాయి. అందుకే చంద్రబాబు అవసరాన్ని క్రియేట్ చేశారు. అభ్యంతరాలు రాకుండా చూసుకున్నారు. సరైన సమయంలో నాగబాబుని ఎమ్మెల్సీ చేస్తున్నారు. మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిని అంచనా వేయలేకపోయింది. సోషల్ మీడియాలో వస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూసింది. కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రం తాము అనుకున్నది చేయగలిగారు.