ఏపీలో ఆర్టీసీ లో మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం అటకెక్కినట్టేనా? ఇప్పట్లో అమలు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రకటించారు చంద్రబాబు. అధికారంలోకి వచ్చిన తర్వాత అదిగో ఇదిగో అంటూ కాలయాపన తప్ప.. పథకం మాత్రం ప్రారంభం కాలేదు. ఇప్పట్లో ఈ పథకం ప్రారంభం కాదని తేలిపోయింది. ఇటీవల శాసనసభలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో కనీసం ఉచిత బస్సు ప్రయాణ పథకానికి సంబంధించి ఊసు లేదు. దీంతో ఈ ఏడాది కూడా ఈ పథకం లేనట్టేనని తెలుస్తోంది.
తొలుత కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రకటించింది. అక్కడ ప్రజలు గుంప గుత్తిగా ఓట్లు వేశారు. మహిళలు ఆదరించడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. అటు తర్వాత తెలంగాణలో సైతం ఇదే హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ కూడా మహిళలు ఆదరించడంతో అధికారంలోకి రాగలిగింది. అయితే ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించాయి.
అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అదిగో ఇదిగో అంటూ కాలయాపన జరుగుతూ వచ్చింది. ఉగాది నుంచి తప్పకుండా పధకం ప్రారంభమవుతుందని అంత ఆశించారు. కానీ ఎందుకో ఈ పథకం ఊసు లేదు. అసలు ఇప్పట్లో ఈ పథకం ప్రారంభించే ఉద్దేశం లేనట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం తెగ హడావిడి చేస్తోంది.
తొలుత సంక్రాంతి నుంచి ఈ పథకం అని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. తరువాత ఉగాది అంటూ వార్తలు వచ్చాయి. ఆ మధ్యన మంత్రుల కమిటీ కర్ణాటకలో అధ్యయనం కూడా చేసింది. తెలంగాణలో అమలవుతున్న ఈ పథకం గురించి ఆరా తీసింది. అయితే ఎంత చేసిన పథకం ప్రారంభం ఎప్పుడన్నది స్పష్టత ఇవ్వడం లేదు. వార్షిక బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంతో ఈ పథకం అమలుపై నీలి నీడలు కమ్ముకున్నాయి.
తాజాగా శాసనమండలిలో ఓ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దీనిపై ప్రశ్నించారు. మహిళలు ఆశగా ఎదురుచూస్తున్న ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు అని. సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు మహిళలకు ఈ పథకం ఎంతగానో అక్కరకు వస్తుందని చెప్పుకొచ్చారు. అయితే దీనిపై మహిళా మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడారు. ఈ పథకం సుదూర ప్రాంతాలకు కాదని.. జిల్లాలో మాత్రమేనని తేల్చి చెప్పడంతో పథకం పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుంది. మంత్రి ప్రకటనతో మరో పథకం అటకెక్కిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.