కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చాలా కాలం తరువాత బయటకు వచ్చారు. ఆయన క్రియశీల రాజకీయల నుంచి తప్పుకున్న తరువాత కాపు ఉద్యమ నేతగా అవతరించిన సంగతి అందరికి తెలిసిందే. పార్టీలకు అతీతంగా కాపులను ఐక్యం చేయడంలో ముద్రగడ పద్మనాభం విజయం సాధించారనే చెప్పాలి. 2014లో చంద్రబాబు కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి.. మాట తప్పడంతో ముద్రగడ పద్మనాభం టీడీపీ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. దీనిపై ఆయన తన నివాసంలో నిరాహారదీక్ష కూడా చేపట్టిన సంగతి అందరికి తెలిసిందే. ఆ సమయంలో ముద్రగడ పద్మనాభంపై చంద్రబాబు చాలా దారుణంగా వ్యవహరించారు. పోలీసులతో ఆయన్ను , ఆయన కొడుకును కొట్టించిన ఘటన ఇప్పటికి అందరికి గుర్తే ఉండే ఉంటుంది.
ఈ ఘటన తరువాత ముద్రగడ పద్మనాభం పెద్దగా బయటకు వచ్చింది లేదు. తాజాగా ఆయన ఏపీ సీఎం జగన్‌కు ఓ లేఖ రాయడం జరిగింది. కాపు జాతికి రిజర్వేషన్ కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈడబ్ల్యూఎస్ కింద వచ్చిన రిజర్వేషన్లు మిగిలిన వారికి ఇవ్వగా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని తన లేఖలో కోరారు. కాపులకు రిజర్వేషన్లు… కాపులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ తాను గతంలో రాసిన లేఖలను కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కాపు జాతికి రిజర్వేషన్లు కల్పించి వచ్చే ఎన్నికల్లో వారిని అనుకూలంగా మలచుకోవచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తమ ఇష్టం వచ్చినట్లు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయవచ్చని చెప్పిన నేపథ్యంలో ఈ లేఖ రాస్తున్నానని ఆయన తెలిపారు. 2019 ఎన్నికల్లో కాపు జాతి మీకు అండగా నిలిచిన విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు.
ఇదిలా ఉంటే ముద్రగడ పద్మనాభంను తమ పార్టీలోకి తీసుకురావాలని వైసీపీ నాయకులు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయనే పార్టీకి కీలకంగా మారతారన్న టాక్ వినపడుతుంది. ఆయన కోరుకుంటే రాజ్యసభ పదవి కాని లేదంటే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో సీటు గాని ఇస్తామన్న ఆఫర్ ప్రకటించినట్లు తెలిసింది. ముదగ్రడ కాకపోయినా ఆయన ఆశీస్సులు పొందేందుకు ఆయన కుమారుడికి అయినా ఎమ్మెల్యే సీటు ఇచ్చి గౌరవించడానికి వైసీపీ పార్టీ రెడీగా ఉంది. ఇక దీనిపై అ అంతిమ నిర్ణయం ముద్రగడదేనని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌కు ముద్రగడ పద్మనాభం లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.