ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకి మోత అన్నట్టు ఉంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిస్థితి. ప్రస్తుతం ఆయన జాతీయస్థాయి నాయకుడు. దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన నేత. మంచి చరిష్మ ఉన్న నాయకుడు. దేశ ప్రధాని మోడీ సైతం పవన్ కళ్యాణ్ తో సన్నిహితంగా గడుపుతున్నారు. సరదా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఆయన పవన్ కాదు తుఫాన్ అంటూ అభివర్ణిస్తున్నారు. అదే సమయంలో కూటమి పార్టీల్లో కీలక సహచరుడిగా.. కష్టంలో ఉన్నప్పుడు అండగా నిలిచారని చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, చివరకు సతీమణి భువనేశ్వరి సైతం పవన్ కళ్యాణ్ కు ఎనలేని గౌరవం ఇస్తున్నారు. కానీ అటువంటి పవన్ కళ్యాణ్ కు సొంత నియోజకవర్గం లో టిడిపి నేత కొరకరాని కొయ్యగా మారారు. కనీసం గౌరవం ఇవ్వడం లేదు.
ఈ ఎన్నికల్లో జనసేన సూపర్ విక్టరీ సాధించింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపొందింది. రెండు పార్లమెంట్ స్థానాల్లో సైతం సత్తా చాటింది. సూపర్ విక్టరీ తో శత శాతం విజయం సొంతం చేసుకుంది. అటువంటి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అంటేనే దేశవ్యాప్తంగా అందరూ గౌరవిస్తున్నారు. జేజేలు పలుకుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురానికి చెందిన టిడిపి నేత వర్మ మాత్రం అందుకు అంగీకరించడం లేదు. అసలు జనసేన ది ఒక గెలుపేనా? పవన్ కళ్యాణ్ తాను సొంతంగా గెలిచారా? అని అర్థం వచ్చేలా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ సొంతంగా గెలవలేదని.. తాను గెలిపించానని గుర్తు చేసేలా ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. దీంతో పవన్ కళ్యాణ్ పరువు ఒక్కసారిగా గంగపాలు అయింది. పిఠాపురం వర్మ వల్లే పవన్ కళ్యాణ్ గెలిచారు తప్ప.. అది ఆయన సొంత బలం కాదన్నట్టు ప్రత్యర్ధులు ప్రచారం చేయడం ప్రారంభించారు.
అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరువుకు భంగం వాటిల్లేలా వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఏంటనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది. అది వర్మ ఒక్కడి అభిప్రాయమేనా? లేకుంటే తెలుగుదేశం అభిప్రాయమా? అనేది ఇప్పుడు జనసైనికుల అనుమానం. పవన్ కళ్యాణ్ కలవడం వల్లే కూటమి అధికారంలోకి వచ్చిందని జన సైనికుల అభిప్రాయం. అయితే తమతో పొత్తు పెట్టుకోవడం వల్లే జనసేన బోనీ కొట్టిందని టిడిపి అభిప్రాయం. అయితే ఇప్పటివరకు లోలోపల ఇదే అభిప్రాయాలతో కొనసాగుతుండగా.. పిఠాపురం వర్మ ఏకంగా పవన్ కళ్యాణ్ పై పోస్టు పెట్టడం మాత్రం జనసైనికుల్లో ఆందోళనకు గురిచేస్తోంది.
అయితే వర్మ పార్టీ అనుమతి లేకుండా ఆ పోస్ట్ పెట్టరు. ఒకవేళ ఆయనకు అన్యాయం జరిగిందని భావిస్తే ఆవేదనతో కూడిన పోస్ట్ చేయవచ్చు కదా. పవన్ కళ్యాణ్ కోసం ఆయన సీటు త్యాగం చేశారు. అలా చేసినందుకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పారు చంద్రబాబు. కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది. ఇంతవరకు ఎమ్మెల్సీ పదవి రాలేదు. తప్పకుండా వర్మలో ఆవేదన ఉంటుంది. అయితే దానిని పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లాలే కానీ.. పవన్ కళ్యాణ్ ను పలుచన చేయడం ఎంతవరకు సమంజసం అని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక టిడిపి నాయకత్వం ఉందని అనుమానిస్తున్నారు. మొత్తానికి అయితే వర్మ ట్వీట్ కూటమి పార్టీల్లో పెద్ద బ్లాస్టింగ్ ఏర్పరిచింది. నేరుగా పవన్ కళ్యాణ్ పైనే కుట్ర చేస్తున్నారనే అనుమానాలను బలపరిచింది.