అధినేతకు జనాదరణ ఉంది. జగన్ ఆయనను అభిమానిస్తున్నారు. పార్టీ శ్రేణులు ఆయనను ఆరాధిస్తున్నారు. కానీ ఎన్నికల్లో విజయానికి అవి సరిపోతాయా? అవే భారీ గెలుపును తెచ్చి పెడతాయా? అంటే చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ లో జరుగుతున్న పరిస్థితి అదే. జగన్మోహన్ రెడ్డికి తరగని అభిమానం ప్రజల్లో ఉంది. 40 శాతం ఓటు బ్యాంకు ఉంది. అంతవరకు ఓకే. కానీ ఆ పార్టీని గట్టెక్కించే టీమ్ మాత్రం లేదు. టీం వర్క్ అస్సలు జరగడం లేదు. అది ముమ్మాటికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఫల్యంగా మారుతోంది. అప్పటికీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి మైనస్ గా నిలిచింది.
రాజకీయం అంటేనే ఒక చదరంగం. రాజకీయం అంటేనే ఒక క్రికెట్ టీం మాదిరి. క్రికెట్ లో 11 మంది ఆడితేనే విజయం సొంతం అవుతుంది. అదే మాదిరిగా రాజకీయంలో కూడా టీం అంతా పని చేస్తేనే ఆ పార్టీకి సంపూర్ణ విజయం దక్కుతుంది. లేకుంటే మాత్రం ఇబ్బందికరమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కూడా టీం వర్క్ లేదు. అది లేకుంటే ఎన్నికలను ఎదుర్కోవడం చాలా కష్టం. కేవలం ప్రజల అభిమానమే కాదు.. వారి ఓట్లు కూడా పొందాల్సి ఉంటుంది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఎంత మంది ప్రజలకు తెలుసు. పులివెందుల నుంచి గెలిచిన జగన్మోహన్ రెడ్డి, పుంగనూరు నుంచి గెలిచిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే తెలుసు. మరో ముగ్గురు రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలు కొంతవరకు తెలుసు. కానీ మిగతావారు ఎవరో తెలియదు. అసలు వారి ముఖాలు కూడా జనాలకు పరిచయం లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి, బాలనాగిరెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వంటి వారు ఓకే. కానీ వారికి వాయిస్ లేదు. వారు వాయిస్ కూడా వినిపించడం లేదు. అసలు ఆ ప్రయత్నమే చేయడం లేదు.
వైసిపి మాజీల్లో చాలామందికి వాయిస్ ఉంది. బలమైన బేస్ ఉంది. కానీ ప్రజల్లో విశ్వాసం లేదు. వారి వాయిస్ను వినేవారు లేరు. కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, ఆర్కే రోజా, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు.. ఇలా చెప్పుకుంటే పోతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్లకు కొదువ లేదు. కానీ వారిలో ఫైర్ ఉంది కానీ.. ఆ ఫైర్ ప్రజల వద్దకు వెళ్లేసరికి నీరు గారి పోతుంది. వారితో ప్రజాభిప్రాయాన్ని చెప్పి ప్రయత్నం కూడా చేయలేం.
ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ వంటి సీనియర్లు ఉన్నారు. వారితో మాట్లాడిస్తామంటే ఫుల్ సైలెంట్. కనీసం వారి సేవలను ఉపయోగించుకునే ప్రయత్నం చేయడం లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న టీం ఏంటి.. ఎవరు అంటే ఆ పాత మనుషులే. ఆ పాత ముఖాలే. ప్రజలతో తిరస్కరణకు గురైన వారే. మరి అటువంటి టీం తో గెలుపు సాధ్యమేనా? అసలు ఎన్నికలు ఫేస్ చేయగలరా? మీకు ఫేస్ వాల్యూ ఉంది సరే.. మరి మీ చుట్టూ ఉన్న టీంకు కూడా ఉండాలి కదా. ప్రత్యేక టీం ను ఏర్పాటు చేసుకోవాలి కదా. ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి జాగ్రత్త పడాల్సిందే. పడకపోతే మరోసారి మూల్యం తప్పదు.
కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల వచ్చారు శైలజానాథ్ రెడ్డి. ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. అది ప్రజల్లోకి కూడా వెళ్ళింది. అటువంటి నేతలను తన చుట్టూ తయారు చేసుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి పై ఉంది. ప్రజాభిప్రాయాన్ని తిరిగి ప్రజలకు వివరించేలా, ప్రభుత్వ వైఫల్యాలపై సిద్ధాంత పరంగా మాట్లాడే ఒక టీంను ఏర్పాటు చేసుకుంటే అది జగన్మోహన్ రెడ్డికే మంచిది. లేకుంటే మాత్రం ఇబ్బందికరమే