జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత. విపరీతమైన ప్రజాభిమానం కలిగిన నాయకుడు. ఈ ఎన్నికల్లో ఆయన పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం చవిచూసింది. కానీ 40% ఓట్లు సాధించి.. రికార్డ్ సృష్టించింది. సీట్ల పరంగా ఫలితం రాకున్నా.. ఓట్ల పరంగా మాత్రం తనదైన ముద్ర చాటుకుంది. అటువంటి పార్టీ అధినేత భద్రతకు పెద్ద పీట వేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం పై ఉంది. పోలీస్ యంత్రాంగం పై ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి భద్రతను భారీగా కుదించింది. పోలీస్ సెక్యూరిటీని తగ్గించింది. మొన్నటికి మొన్న గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి. అక్కడ మిర్చి రైతుల సమస్యలను అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డికి కనీసం పోలీస్ సెక్యూరిటీ లేదు. జెడ్ ప్లస్ కేటగిరి లో ఉన్న ప్రతిపక్ష నేతకు తగినంత భద్రత లేకపోవడం వైఫల్యం స్పష్టంగా కనిపించింది. అయితే దీనిని సమర్థించుకుంది రాష్ట్ర ప్రభుత్వం. తమకు సమాచారం ఇవ్వకుండా వెళ్తే మేమేం చేసేది అంటూ చేతులెత్తేసింది. ప్రస్తుతం దీనిపైనే చర్చ నడుస్తోంది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నేత విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అభ్యంతరకరంగా ఉంది. దీనిని మేధావి వర్గంతో పాటు పోలీసు వర్గాలు కూడా తప్పుపడుతున్నాయి.
నిన్నటికి నిన్న శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు జగన్మోహన్ రెడ్డి. ఆ సమయంలో కూడా పోలీసు భద్రత లేకుండా పోయింది ఆయనకు. సొంత పార్టీ శ్రేణులే సెక్యూరిటీ కల్పించుకోవాల్సి వచ్చింది. గత కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డి ఇంటి సమీపంలో జరిగిన పరిణామాలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనతో ఉన్నాయి. తిరుపతి లడ్డు వివాదం నేపథ్యంలో బిజెపి యువమోర్చా నాయకులు ఆయన ఇంటిపై దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో వారిని నిలువరించేందుకు వ్యక్తి గత భద్రత సిబ్బంది ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి ఇంటి ప్రాంగణంలోనే అనుమానాస్పదంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ మంటలను వ్యక్తిగత సిబ్బంది ఆర్పడంతో ప్రమాదం తప్పింది. మంత్రి నారా లోకేష్ జన్మదిన నాడు టిడిపి శ్రేణులు జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు హల్చల్ చేశాయి. హారన్లతో రోత పుట్టించాయి.
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అంటేనే ఒక పతాక స్థాయికి చేరుకున్నాయి. రాజకీయ ప్రత్యర్ధులు శత్రువులుగా మారిపోయారు. కనీసం నేతల మధ్య పలకరింపు లేదు. పార్టీ శ్రేణుల మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తూనే ఉంటుంది. వాగ్వ వాదాలతో పాటు పురుష పదజాలాలు నడుస్తుంటాయి. ఇటువంటి సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం పై ఉంది. అటువంటిది ప్రతిపక్ష నేత, మొన్నటి వరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించడంలో ఏపీ పోలీస్ యంత్రాంగం దారుణంగా విఫలమైంది.
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆందోళనలను నేపథ్యంలో ఆ పార్టీ లోక్ సభ పక్ష నేత మిధున్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రాణానికి హాని ఉందని.. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని.. అందుకే కేంద్ర బలగాలతో జగన్మోహన్ రెడ్డికి రక్షణ కల్పించాలని లేఖ రాశారు. దీనిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆరా తీసినట్లు సమాచారం. అయితే జగన్మోహన్ రెడ్డి పై ఉన్న రాజకీయ కక్షతో చంద్రబాబు సర్కార్ అలా వ్యవహరించకూడదని మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా అభిప్రాయాన్ని మార్చుకొని జగన్మోహన్ రెడ్డికి భద్రత పెంచాలని సూచిస్తున్నారు.