రాజకీయంగా నమ్మించి మోసం చేయడం చంద్రబాబుకు అలవాటైన విద్య. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల్లో బాధితులు ఎంతోమంది ఉన్నారు. తాజాగా అటువంటి బాధితుల జాబితాలో వంగవీటి రాధాకృష్ణ చేరారు. కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం పదవి గ్యారెంటీ అని ఆయనకు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో రాధాకృష్ణ తెగ బాధ పడిపోతున్నారట. అనవసరంగా టిడిపిలో చేరానని.. జగన్మోహన్ రెడ్డిని వదులుకున్నానని ఆవేదనతో ఉన్నారట.
అయితే 2004లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు రాధాకృష్ణ. వైయస్ రాజశేఖర్ రెడ్డి సొంత మనిషిలా చూసుకున్నారు. అప్పట్లో ఆయన మాట కాదని ప్రజారాజ్యం పార్టీలో చేరి మూల్యం చెల్లించుకున్నారు రాధాకృష్ణ. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి సైతం వారించిన వినలేదు. ఎంపీగా గెలిపించి పార్లమెంట్కు పంపిస్తానన్న జగన్ మాటను బేకాతరుచేసి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోయారు. అప్పుడు అలా మూల్యం చెల్లించుకున్నారు.
2019లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. కానీ ఆ పార్టీ ఓడిపోయింది. గత ఐదేళ్లుగా ప్రతిపక్షంలో ఉండిపోయారు. తనకు సన్నిహితులుగా ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ బతిమలాడిన రాధాకృష్ణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. టిడిపి అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని.. తప్పకుండా తనకు పదవి వస్తుందని కొండంత ఆశలు పెట్టుకున్నారు.
కూటమి అధికారంలోకి వస్తే తప్పకుండా పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో ఎన్నికల్లో పోటీకి పెద్దగా ఆసక్తి చూపలేదు రాధాకృష్ణ. పైగా చంద్రబాబుతో పాటు లోకేష్ నాయకత్వాన్ని బలంగా సమర్థించారు. ఓటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనకు ఎటువంటి గుర్తింపు దక్కలేదు.
అయితే రాజకీయంగా తప్పటడుగులు వేశానని రాధాకృష్ణ తెగ బాధపడి పోతున్నారట. రాజకీయాల నుంచి తప్పుకోవడమే మేలన్న నిర్ణయానికి వచ్చారట. అయితే అనుచరులు అభిమానులు మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడమే ఉత్తమమని సలహా ఇస్తున్నారట.
జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా చొరవ చూపి రాధాకృష్ణను పిలిస్తే తప్పకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. అయితే ప్రతిసారి తప్పుడు నిర్ణయాలతో మూల్యం చెల్లించుకుంటున్న రాధాకృష్ణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు జంకుతున్నారట. అయితే టిడిపి హై కమాండ్ ఇలానే నిర్లక్ష్యం కొనసాగిస్తే మాత్రం ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయంగా తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.