సోము వీర్రాజు.. ఈ పేరు వింటేనే టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసేవి. ఆయనపై వైసీపీ అనుకూల ముద్ర వేసేవి. ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మనిషని టిడిపి నేతలు ఆరోపణలు చేసేవారు. అయితే ఇప్పుడు అదే సోము వీర్రాజుకు కూటమి తరుపున ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చారు. అయితే ఆయన ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మనిషా? లేకుంటే బిజెపికి చెందిన నేత? ఇప్పుడు ఇదే పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్.
బిజెపి సీనియర్లలో సోము వీర్రాజు ఒకరు. ఇప్పుడు పార్టీలో ఉన్న వారంతా వలస నేతలే. ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి నుంచి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ వరకు అందరూ అద్దెనేతలే. సుజనా చౌదరి లాంటి నేతలు బిజెపి సిద్ధాంతాల కోసం పార్టీలో చేరలేదు. కేవలం వారి స్వప్రయోజనాల కోసమే చేరారు అన్నది బహిరంగ రహస్యం. టిడిపి ప్రయోజనాల కోసమే బిజెపిలో చేరారు అన్నది ఢిల్లీ పెద్దలకు కూడా ఉంది సందేశం.
అయితే సోము వీర్రాజు ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి వచ్చిన నేత. దశాబ్దాలుగా ఏపీలో బిజెపి బలపడక పోవడానికి తెలుగుదేశం పార్టీ కారణమన్నది ఆయన ప్రధాన వాదన. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల బిజెపి స్వయంగా ఎదగలేదన్నది వాదించిన నేతల్లో ఆయన ఒకరు. ఈ క్రమంలో టిడిపికి ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మనిషిగా కనిపించారు. అందుకే తెలుగుదేశం అధినేత చంద్రబాబు శక్తియుక్తులను ఉపయోగించి ఏపీ బీజేపీ చీఫ్ గా సోము వీర్రాజును తొలగించి పురందేశ్వరిని కూర్చోబెట్టారు. బిజెపితో లైన్ క్లియర్ చేసుకున్నారు.
ఇప్పుడు ఏపీలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 20న ఎన్నికలు జరగనున్నాయి. జనసేన తరఫున నాగబాబు పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన నామినేషన్ దాఖలు చేశారు. టిడిపి మూడు ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకుంది. బీదా రవిచంద్ర, కావలి గ్రీష్మ ప్రసాద్, బీటీ నాయుడు పేర్లను ఖరారు చేశారు చంద్రబాబు. అయితే బిజెపి మాత్రం అనూహ్యంగా సోము వీర్రాజు పేరును ప్రకటించింది.
అయితే సోము వీర్రాజు ప్రకటన వెనుక కారణం ఏమై ఉంటుందా అన్నది ఇప్పుడు ప్రశ్న. సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు వీర్రాజు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ అనుకూల ముద్ర వేసి ఆయనకు చాన్స్ దక్కకుండా చేశారన్నది ప్రధాన ఆరోపణ. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం వెనుక చంద్రబాబు సమ్మతైన ఉండాలి. లేకుంటే ఆర్ఎస్ఎస్ ఒత్తిడి అయినా ఉండాలి. ఈ రెండు పక్కన పెడితే ఇప్పుడు సోము వీర్రాజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూలురా? లేకుంటే టీడీపీ కూటమి వ్యతిరేక? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో తొ లుస్తున్న ప్రశ్న ఇదే. కచ్చితంగా కూటమిలో సోము వీర్రాజు ప్రభావం ఉంటుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. అయితే సోము వీర్రాజు ఎంపికపై టిడిపి శ్రేణులు మాట్లాడడం లేదు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మాత్రం హర్షం వ్యక్తం అవుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.