విజయసాయిరెడ్డి చంద్రబాబుకు సాయం చేయడం ప్రారంభించారా? వ్యవసాయం మానేసి సాయం చేస్తున్నారా? అందులో భాగంగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. టిడిపి శ్రేణుల ప్రకటనలు చూస్తే విజయసాయిరెడ్డి విషయంలో వారి అభిప్రాయం మారిందన్న అనుమానం కలుగుతోంది.
వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డిని టిడిపి శ్రేణులు విపరీతంగా వ్యతిరేకిస్తాయి. అటు తరువాత విజయసాయిరెడ్డి పై ఆ తరహాలో కోపం ఉండేది. దానికి కారణం వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆయన వ్యవహార శైలి. కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య నుంచి ముఖ్య నేతల అరెస్టుల వరకు విజయసాయిరెడ్డి పాత్ర ఉందన్నది టిడిపి నేతలు అనుమానం. అటువంటి టిడిపి నేతలు ఇప్పుడు విజయసాయి రెడ్డి పై సానుభూతి చూపడం విశేషం.
కొద్దిరోజుల కిందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు విజయసాయిరెడ్డి. క్రియాశీలక రాజకీయాలనుంచి దూరమవుతున్నట్లు ప్రకటించారు. ఇకనుంచి రాజకీయాలు మాట్లాడనని.. వ్యవసాయం చేసుకుంటానని స్పష్టం చేశారు. అయితే ఆయన ఇప్పుడు వ్యవసాయం కంటే వివాదాస్పద కామెంట్స్ కి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు.
కాకినాడ సి పోర్టు వాటాల బదిలీల విషయంలో అవకతవకలు జరిగాయన్నవి ప్రధాన ఆరోపణలు. దీనిపై సీఐడీ దర్యాప్తు చేస్తోంది. సిఐడి ఇచ్చిన నోటీసుల మేరకు విచారణకు హాజరయ్యారు విజయసాయిరెడ్డి. ఈ క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చుట్టూ ఉన్న కోటరీపై సంచలన ఆరోపణలు చేశారు విజయసాయిరెడ్డి. సహజంగానే ఇవి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడనివి. అందుకే ఆ పార్టీ నేతలు కౌంటర్ ఇస్తుండగా.. టిడిపి నేతలు మాత్రం విజయసాయిరెడ్డిని వెనుకేసుకు రావడం విశేషం.
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అయితే ఏకంగా విజయసాయిరెడ్డి పై సానుభూతి వర్షం కురిపించారు. జగన్మోహన్ రెడ్డి కోసం విజయసాయి రెడ్డి 16 నెలల పాటు జైలు జీవితం అనుభవించారని చెప్పుకొచ్చారు. అటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టడానికి తప్పుపట్టారు. ఆ పార్టీ అంతర్గత వ్యవహారాల గురించి మాట్లాడుతూ గంటా శ్రీనివాసరావు లాంటి సీనియర్ విజయసాయి రెడ్డి పై సానుభూతి చూపడం విశేషం.
ఇదే గంటా శ్రీనివాసరావు అండ్ టిడిపి నేతలు విజయసాయి రెడ్డి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు. నోరు తెరిస్తే విజయసాయిరెడ్డి పై తీవ్ర పదజాలాలు ఉపయోగించేవారు. కానీ ఎప్పుడైతే విజయసాయిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు ప్రారంభించారో.. అప్పుడే టిడిపి విజయసాయిరెడ్డిని తమ వాడిగా చూడడం ప్రారంభించింది. మున్ముందు ఈ పరిణామాలు ఎంతవరకు వెళ్తాయో చూడాలి.