Tuesday, April 22, 2025

తీవ్ర అవమాన భారంతో యనమల!

- Advertisement -

యనమల రామకృష్ణుడు తీవ్ర అసహనంతో ఉన్నారు. కనీసం తన పదవీ విరమణ కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కాలేదు. విజయవాడలో జరిగిన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల క్రీడా పోటీలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు సైతం దూరంగా ఉన్నారు. దీంతో తీవ్ర అవమాన భారంతో ఆయన రగిలిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అగౌరవంగా తనను రాజకీయాలనుంచి విరమణ చేసేలా చేశారని ఆయన తీవ్ర బాధపడుతున్నట్లు టాక్ నడుస్తోంది.

నిన్న విజయవాడలో జరిగిన వేడుకలకు టిడిపిలో సీనియర్ మోస్ట్ లీడర్లంతా హాజరయ్యారు. కానీ యనమల రామకృష్ణుడు లేని లోటు మాత్రం స్పష్టంగా కనిపించింది. చివరకు రాజకీయాలకు దూరంగా ఉన్న అశోక్ గజపతిరాజు సైతం అక్కడ మెరిశారు. యనమల లేకపోయేసరికి ఆయన పైనే చర్చ జరిగింది.

చంద్రబాబు రాజకీయ ఉన్నతికి యనమల రామకృష్ణుడు ఒక కారణం. 1995లో టిడిపి సంక్షోభ సమయంలో చంద్రబాబుకు అండగా నిలిచారు స్పీకర్ గా ఉన్న యనమల రామకృష్ణుడు. నాడు యనమల నిర్ణయం తీసుకోకుంటే చంద్రబాబు సీఎం అయ్యేవారు కాదు. ఇంత ఉన్నత స్థాయి సాధించి ఉండేవారు కాదు. ఇదంతా యనమల చలువే.

అలాగని యనమల రామకృష్ణుడును చంద్రబాబు తక్కువ చేయలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మంత్రి పదవి. ప్రతిపక్షంలో ఉంటే పార్టీ పదవి. సొంత నియోజకవర్గ తునిలో రెండు దశాబ్దాలుగా గెలవలేకపోయారు యనమల రామకృష్ణుడు. అటువంటి సమయంలో ఎమ్మెల్సీ గానే కాకుండా మంత్రిగా అవకాశం ఇచ్చారు చంద్రబాబు.

అయితే ఆ ఇద్దరు నేతలు పరస్పరం గౌరవించుకునేవారు. చంద్రబాబు నాయకత్వాన్ని సమర్థించే వారు యనమల. టిడిపి క్లిష్ట సమయంలో నేనున్నాను అంటూ యనమల గట్టిగానే మాట్లాడేవారు. అయితే గత మూడు దశాబ్దాలుగా చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యంతో రాజకీయాలు కొనసాగించారు యనమల. కానీ ఇప్పుడు ఉన్నఫలంగా చంద్రబాబు యనమలను విడిచి పెట్టేశారు. గౌరవప్రదమైన పదవీ విరమణ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు యనమల రామకృష్ణుడు లో ఉన్న బాధ అదే.

నిన్న జరిగిన ఎమ్మెల్సీల పదవీ విరమణ కార్యక్రమానికి యనమల గైర్హాజరయ్యారు. శాసనమండలి సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు. విజయవాడ వచ్చిన వ్యక్తిగత పనులు చూసుకుని అటు నుంచి అటే వెళ్ళిపోతున్నారు యనమల. అయితే తన విషయంలో చంద్రబాబు అన్యాయం చేశారని మాత్రం అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్లపాటు మంచి పదవులు ఇచ్చి.. పదవీ విరమణ ముందు మాత్రం అలానే వదిలేసారని ఆవేదనతో ఉన్నారు.

అయితే ఇదంతా లోకేష్ చేస్తున్న వ్యవహారంగా యనమల అనుమానిస్తున్నారు. ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లా అంటే యనమల.. యనమల అంటే తూర్పుగోదావరి అన్నట్టు పరిస్థితి ఉండేది. ఆ జిల్లా అంతా యనమల కంట్రోల్ లో ఉండేది. కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం గా పవన్ ఉన్నారు. మరోవైపు లోకేష్ అనుచరుడు సానా సతీష్ ఉన్నారు. పార్టీపరంగా సతీష్ మాట చెల్లుబాటు అవుతోంది. దీంతో ఈ రాజకీయ కురువృద్ధుడు మాత్రం దిగాలు పడిపోయారు. ఇన్నాళ్లు గౌరవంగా రాజకీయం చేశానని.. చివరి రోజుల్లో ఇదేంటి పరిస్థితి అని యనమల బాధపడుతున్నట్లు సమాచారం.

అయితే ఇంత జరుగుతున్నా.. యనమల అలకబూనిన చంద్రబాబు మాత్రం పిలిచి మాట్లాడడం లేదు. అదే ఎక్కువగా యనమలను బాధిస్తోంది. తన కుటుంబం నుంచి కుమార్తె, వియ్యంకుడు, అల్లుడు ఇలా అందరికీ అవకాశం ఇచ్చారని.. మంచిదే అయినా.. తన గౌరవం మాత్రం తగ్గించారని యనమల ఎక్కువగా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మరి చంద్రబాబు పిలిచి మాట్లాడతారా? సర్ది చెబుతారా? మరో పదవి సర్దుబాటు చేస్తారా? అన్నది చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!