మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ యాక్టివ్ కానున్నారా? ఆయనకు పర్మినెంట్ నియోజకవర్గం కేటాయించనున్నారా? నెల్లూరు బదులు ప్రకాశం జిల్లాకు పంపనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు అనిల్ కుమార్ యాదవ్. గత ఐదేళ్లుగా ఆయన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే గా ఉండేవారు. మంత్రిగా కూడా వ్యవహరించారు. అయితే నియోజకవర్గంలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెప్పి.. ఆయనను నరసరావుపేట పార్లమెంట్ స్థానానికి షిఫ్ట్ చేశారు జగన్. అయినా సరే ఆయన ఓటమి చవిచూశారు. ఓడిపోయిన నాటి నుంచి పార్టీలో పెద్దగా యాక్టివ్ లేకుండా పోయింది. ఎక్కడో రాష్ట్రానికి దూరంగా వ్యాపారాలు చేసుకుంటున్నారని ప్రచారం నడుస్తోంది. అయితే తాను యాక్టివ్ కావాలంటే పర్మినెంట్ నియోజకవర్గ కావాలని అనిల్ కుమార్ యాదవ్ కోరుతున్నారు. దీంతో ఆయనకు ప్రకాశం జిల్లా కనిగిరి బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం ప్రారంభం అయింది.
సహజ పర్యావరణ అందాలకు పెట్టింది పేరు కనిగిరి నియోజకవర్గం. ఇక్కడి రాజకీయాలు ప్రశాంతంగానే ఉంటాయి. నమ్ముకున్న వారిని ఇక్కడి వాటర్ లో భారీ మెజారిటీతో గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. యాదవ సామాజిక వర్గ ప్రభావం అధికం. 2014లో బుర్ర మధుసూదన్ యాదవ్ తొలిసారిగా వైసీపీ నుంచి బరిలో దిగారు. ఆ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. 2019 ఎన్నికల్లో అదే మధుసూదన్ యాదవ్ కు అవకాశం ఇచ్చారు జగన్. భారీ మెజారిటీతో ఆయన గెలిచారు. అయితే ఈ ఎన్నికల్లో అదే మధుసూదన్ యాదవ్ను పక్కన పెట్టారు జగన్. దద్దాల నారాయణ యాదవ్ కు అవకాశం ఇచ్చారు. ఆయనకు ఓటమి పలకరించింది. అయితే ఇక్కడ టిడిపి అభ్యర్థి విజయం సాధించారు. అయితే ఇక్కడ వైసీపీలో విభేదాలపర్వం నడుస్తోంది. ఇటువంటి తరుణంలో అనిల్ కుమార్ యాదవ్ అయితే ఇక్కడ సరిపోతారని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
నెల్లూరు సిటీ నుంచి రాజకీయాలు చేశారు అనిల్ కుమార్ యాదవ్. 2014 ఎన్నికల్లో అతి కష్టం మీద గెలిచారు. 2019 జగన్ ప్రభంజనంలో సైతం తక్కువ మెజారిటీతోనే బయటపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అనిల్ కుమార్ యాదవ్ మరింత దూకుడు పెంచారు. ఈ క్రమంలో పార్టీలో చాలామందిని దూరం చేసుకున్నారు. కీలక నేతలంతా ప్రత్యర్థులుగా మారిపోయారు. అనిల్ కుమార్ యాదవ్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలో అనిల్ ఉంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని జగన్ భావిస్తున్నారు. ఆయన సేవలను వేరే జిల్లాలో వినియోగించుకోవాలని చూస్తున్నారు జగన్.
నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన అనిల్ తర్వాత కనిపించకుండా పోయారు. దీంతో ఆ పార్లమెంటు స్థానానికి బాధ్యుడు లేకుండా పోయారు. తప్పకుండా అనిల్ యాక్టివ్ అవుతారని.. నరసాపురం పార్లమెంట్ బాధ్యతలు చూస్తారని అంతా భావించారు. కానీ ఆయన చూపు కనిగిరి వైపు ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే జగన్ కొంత స్పష్టత ఇచ్చారని.. అతి త్వరలో కనిగిరి వైపు అనిల్ వెళ్తారని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
