YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిక్లరేషన్ వివాదం తెర మీదకి వచ్చిన తరువాత తిరుమల లడ్డూ వివాదం కాస్త చల్లారినట్టే కనిపిస్తోంది. అధికార తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం జగన్ డిక్లరేషన్ అంశంపైనే పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యిని జంతువుల కొవ్వు, చేప నూనెతో కల్తీ చేశారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నాల్లో భాగంగా- తిరుమలను సందర్శించాలని, చంద్రబాబు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేయడంలో భాగంగా శ్రీవారిని దర్శించుకోవాలనీ జగన్ నిర్ణయించుకున్నప్పటికీ అది కార్యరూపాన్ని దాల్చలేక పోయింది.
చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో శనివారం రోజు పూజల్లో పాల్గొనాలని ఆయన పార్టీ క్యాడర్‌కు మరియు ప్రజలకి సూచించారు. అదే సమయంలో తాను స్వయంగా తిరుమలకు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలి నడకతో వెళ్లాలనీ, రాత్రి అక్కడే బస చేయాలనీ నిర్ణయించారు. జగన్ తిరుమలకు వెళ్తారంటూ వార్తలొచ్చిన మరు క్షణం నుంచే డిక్లరేషన్ అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు టీడీపీ, జనసేన మరియు బీజేపీ నాయకులు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఆ పార్టీ శాసన సభ్యుడు సుజనా చౌదరి, సీనియర్ నాయకుడు భాను ప్రకాష్ రెడ్డి, జనసేన, టీడీపీకి చెందిన పలువురు నేతలు- తిరుమలలో జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని పట్టుబట్టారు. జగన్ రానున్నారనే విషయం తెలిశాక అటు తిరుమలలో కూడా కొత్తగా డిక్లరేషన్‌కు సంబంధించిన ఫ్లెక్సీలు వెలిశాయి. టీటీడీ అధికారులు తిరుమలలో పలు ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేశారు. హైందవేతరులు ఆలయ ప్రవేశానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ఫ్లెక్సీలు అవి.
టీటీడీ ఆలయాలు కేవలం హిందువులకు మాత్రమే చెందినవని, హైందవేతరులు ఆలయ ప్రవేశం చేయాలనుకుంటే శ్రీవేంకటేశ్వర స్వామివారి పట్ల విశ్వాసం, గౌరవం ఉన్నట్లు ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని అందులో పేర్కొన్నారు. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్సులు, అదనపు కార్యనిర్వహణాధికారి క్యాంప్ ఆఫీస్, రిసెప్షన్ కార్యాలయాలు, అన్ని ఉప విచారణ కార్యలయాల వద్ద డిక్లరేషన్ ఫారమ్‌లు అందుబాటులో ఉన్నాయని వాటిలో పొందుపరిచారు. ఆ ఫ్లెక్సీలు, బోర్డులను తిరుమలలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నట్లు వెల్లడించిన తరువాత వాటిని అప్పటికప్పుడు వాటిని తొలగించారు టీటీడీ సిబ్బంది. దానితో అవన్నీ కూడా జగన్‌ను ఉద్దేశించే పెట్టారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శిస్తున్నారు. జగన్ తిరుమలకి రావడం లేదు అని ప్రకటించిన వెంటనే ఆ ఫ్లెక్సీలను తొలగించడం ఒక అనూహ్య పరిణామమని, ఇది కచ్చితంగా జగన్ తిరుమలకి రాకుండా కూటమి ప్రభుత్వమే చేసిందని వారు అడ్డంగా దొరికిపోయారని వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.