గన్నవరంలో తారకరత్న..గుడివాడలో చైతన్య కృష్ణ.. వల్లభనేని వంశీ, కొడాలి నానిలను తట్టుకుంటారా..?
2024లో జరగబోవు ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ చాలా ప్రతీష్టాత్మకంగా తీసుకుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన టీడీపీకి..వచ్చే ఎన్నికలు చావో రేవోలాగా మారాయి. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు ఈ ఎన్నికలే చివరి ఎన్నికలు కావడంతో.. అందరి దృష్టి ఆయన మీద పడింది. ఆయన చివరిసారి సీఎం అవుతారా అని అందరు కూడా అతృతుగా ఎదురు చూస్తున్నారు. వాస్తవ పరిస్థితి మాత్రం దానికి విరుద్దంగా ఉంది. అధికార వైసీపీ పార్టీ పూర్తి బలంగా కనిపిస్తోంది. మరోసారి అధికారం తమదే అనే ధీమా ఆ పార్టీ నాయకులు ఉన్నారు.
ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలియంది కాదు. క్షేత్రస్థాయిలో టీడీపీ అంత బలంగా కూడా లేదనే విషయం కూడా పార్టీ అధినేతకు తెలుసు. అందుకే ఆయన ఒంటరిగా పోటీ చేయడం కన్నా.. పొత్తులతో ముందుకు వెళ్తేనే బెటర్ అనే ఆలోచనకు వచ్చారు. దీనిలో భాగంగానే..జనసేనతో పొత్తులు పెట్టుకోవడానికి ఆయన సిద్దంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ,జనసేన పొత్తులో కలిసి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో తమ అండ కూడా టీడీపీకి ఉంటుందని నందమూరి హీరోలు ప్రకటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్నానని నందమూరి హీరో తారకరత్న ప్రకటించారు.
వచ్చే ఎన్నికల్లో తాను ఏపీ నుంచి పోటీ చేస్తున్నట్లు తారకరత్న ప్రకటించారు. ప్రజల కోసం నందమూరి కుటుంబం పని చేస్తుందన్నారు. టీడీపీ తమదేనని.. తాము పార్టీలో పదవుల కోసం పాకులాడమని తారకరత్న స్పష్టం చేశారు. గుంటూరు జిల్లాలో పాలపర్రులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో తారకరత్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరుఫున ఎన్టీఆర్ ప్రచారం చేస్తారని నందమూరి హీరో తారకరత్న ప్రకటించారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు టీడీపీకి సేవలు అందించేందుకు నందమూరి కుటుంబం సిద్దంగా ఉంటుందని స్పష్టం చేశారు.తమకు పదవులు ముఖ్యం కాదని.. పార్టీయే తమది అయినప్పుడు అందులో మళ్లీ మాకు పదవులు ఏంటని ఆయన ప్రశ్నించారు.
ఒకవేళ తారకరత్న పోటీ చేయడానికి ఇష్టపడితే కనుక ఆయన్ను గన్నవరం నుంచి బరిలోకి దింపే అవకాశాలు ఎక్కువుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే గుడివాడ నుంచి మరో నందమూరి వారసుడు చైతన్య కృష్ణను పోటీ చేయిస్తారనే సంకేతాలు వెలువడుతున్న తరుణంలో..సడన్‌గా తారకరత్న కూడా తాను పోటీ చేస్తానని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరి నందమూరి వారసులకు నారావారు టికెట్ కేటాయిస్తారో లేదో చూడాల్సి ఉంది.