తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు అత్యంత విధేయుడని అందరికీ తెలిసిందే. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపడుతున్న చంద్రబాబుకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. అలాగే ఏపీ-తెలంగాణ మధ్య ఉన్న విభజన సమస్యలు, అపరిష్కృతం కాని సమస్యలు, ఉద్యోగుల పంపిణీ వంటివి పరిష్కారం చేసుకుందామని కోరారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. గ్రాండ్ విక్టరీ కొట్టింది. తెలుగుదేశం పార్టీ సొంతంగా 135 సీట్లు దక్కించుకోగా.. జనసేన 21 స్థానాల్లో బీజేపీ 8 చోట్ల విజయం సాధించింది. మెుత్తం 164 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. దీంతో నాలుగోసారి సీఎంగా చంద్రబాబు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈనెల 12న ఆయన ప్రమాణస్వీకారం చేయనుండగా.. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతిలో చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 8న ప్రధాని మోదీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అటు తరువాత చంద్రబాబు ప్రమాణస్వీకారం ఉండనుండడంతో ప్రధాని మోదీతో పాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. అయితే కాంగ్రెస్ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి సైతం హాజరవుతానని స్వచ్ఛందంగా చెబుతుండడం విశేషం.
గతంలో సీఎం రేవంత్ రెడ్డి టీడీపీలో పని చేశారు. ఆ పార్టీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. చంద్రబాబు, రేవంత్ మధ్య సన్నిహత సంబంధాలున్నాయి. కానీ తెలంగాణలో మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆయన కాంగ్రెస్ పార్టలో చేరి ఆ తర్వాత సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. గతేడాది రేవంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ చంద్రబాబు ట్వీట్ చేసారు. ఇప్పుుడు ఏపీలో చంద్రబాబు ఘన విజయం సాధించేసరికి రేవంత్ రెడ్డి తెగ ఆనందంతో ఉన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నా వెనుకడుగు వేయలేదు. గురువుకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ఆహ్వానిస్తే తప్పకుండా ప్రమాణస్వీకారానికి వెళతానని చెప్పడం విశేషం.
ఇండియా కూటమిలోని ప్రధాన భాగస్వామి కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామి అయిన టీడీపీ అధినేత చంద్రబాబుతో మాట్లాడడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాని పరిస్థితి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కీలకంగా మారింది. చంద్రబాబు ఎన్డీయే కూటమిలో ఉన్నా కూడా ఇండియా కూటమి కూడా టీడీపీకి గాలం వేస్తోంది.
ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబుకు ఇండియా కూటమి గాలం వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో చంద్రబాబు కింద రేవంత్ రెడ్డి పని చేయడంతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆ పరిచయం ద్వారా రేవంత్ ద్వారా చంద్రబాబును ఇండియా కూటమిలోకి ఆహ్వానించినట్లు చర్చ నడుస్తోంది. ఇండియా కూటమికి టీడీపీ మద్దతు తెలపాలని కోరినట్లు కూడా తెలుస్తోంది. అయితే అలాంటి చర్చ వారి మధ్య జరగలేదని రేవంత్ వర్గీయులు చెబుతున్నారు. భవిష్యత్‌లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో వేచి చూడాలి.