Wednesday, October 16, 2024

మైలవరంలో జోగి రమేష్ కుమారుడు చిచ్చు..పోటీ చేస్తానంటూ ప్రకటన

- Advertisement -

కృష్ణాజిల్లా మైలవరం నియోజవర్గంలో ఇన్నాళ్లు అధికార , ప్రతిపక్ష పార్టీల నేతలు మాత్రమే కత్తులు దూసుకునేవారు. టీడీపీ నుంచి దేవినేని ఉమమహేశ్వరరావు ప్రతినిధ్యం వహిస్తుండగా..వైసీపీ నుంచి వసంత కృష్ణప్రసాద్ ప్రతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని ఉమమహేశ్వరరావును వసంత కృష్ణప్రసాద్ గత సార్వత్రిక ఎన్నికల్లో దారుణంగా ఓడించారు. ఇరు నేతలు కూడా ఎప్పుడు విమర్శలు , ప్రతివిమర్శలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కాని తాజాగా వసంత కృష్ణప్రసాద్‌ను సొంత పార్టీ నేతలే టార్గెట్ చేసుకున్నట్లుగా కనిపిస్తుంది. మంత్రి జోగి రమేష్, ఎమ్యెల్యే వసంత కృష్ణప్రసాద్‌ల మధ్య వర్గపోరు ఎక్కువైనట్లు స్పష్టం అవుతుంది.

పెడన నుంచి ప్రతినిధ్యం వహిస్తున్న జోగి రమేష్ వచ్చే ఎన్నికల్లో మైలవరం నియోజవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట. పెడన నియోజవర్గం జోగి రమేష్‌కు వ్యతిరేక పవనాలు వీయడంతోనే ఆయన మైలవరం నుంచి బరిలోకి దిగాలని చూస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇది ఎమ్యెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు పెద్దగా రుచించడం లేదట. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికి కూడా ..స్థానిక పదవులు మొత్తం కూడా జోగి రమేష్ అనుచరులకే ఇచ్చామని.. తాము దేవినేని ఉమమహేశ్వరరావును ఓడించడానికే ఇక్కడకు వచ్చామని.. కాని..ఇప్పుడు తమని ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని వసంత కృష్ణప్రసాద్‌ అనుచరులు వాపోతున్నారు.

ఇప్పటికే దేవినేని ఉమాతో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నామని.. తమ వ్యాపార కార్యకలాపాలను పక్కన పెట్టిమరి.. దేవినేని ఉమాపై పోరాటాలు చేస్తున్నామని వారు తెలిపారు. దీనిపై పార్టీ అధిష్టానంతోనే తేల్చుకుంటామని వసంత కృష్ణప్రసాద్‌ ఇప్పటికే ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఇదిలా ఉంటే జోగి రమేష్ కుమారుడు రాజీవ్ వల్లే ఈ గొడవ మొదలైందని తెలుస్తోంది. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ ఇటీవలే అమెరికా నుంచి వచ్చారు. ఆయన ఇటీవల మైలవరంలో పర్యటించారు.ఆ సమయంలో తాము వచ్చే ఎన్నికల్లో ఈ నియోజికవర్గం నుంచి పోటీ చేస్తామని తెలపడం ఇప్పుడు ఈ సమస్యకు కారణంగా మారిందని పార్టీ వర్గాలు తెలిపాయి. జోగి రమేష్ కూడా మైలవరం మా గడ్డా, మా అడ్డా అంటూ వ్యాఖ్యనించడం పార్టీలో తీవ్ర గందరగోళానికి కారణం అయింది.

అయితే మైలవరంలో దేవినేని ఉమమహేశ్వరరావును అడ్డుకోవడం జోగి రమేష్ వల్ల కాదని.. దేవినేని ఉమాను ఢీ కొట్టే సత్తా వసంత కృష్ణప్రసాద్‌‌కే ఉందని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. ఇద్దరు కూడా కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో..ఓట్లు చీలిపోయే అవకాశం ఉందని.. జోగి రమేష్ పోటీ చేస్తే.. కమ్మ సామాజికవర్గం ఓట్లు మొత్తం కూడా టీడీపీకే పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి మైలవరంలో అధికార పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎవరు బరిలోకి దింపుతుందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!