Monday, February 10, 2025

బాపట్ల వైసిపి ఇన్చార్జిగా యాంకర్ శ్యామల

- Advertisement -

యాంకర్ శ్యామల కు జగన్ ప్రమోషన్ ఇవ్వనున్నారా? ఆమెకు బాపట్ల ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించనున్నారా? ఈ మేరకు కసరత్తు జరుగుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికల్లో వైసిపి కోసం విస్తృత ప్రచారం చేశారు యాంకర్ శ్యామల. రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసి ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో ఆమె జనసేనకు టార్గెట్ అయ్యారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో మరింత లక్ష్యంగా చేసుకుంటూ శ్యామల రెడ్డి పై దుష్ప్రచారం ప్రారంభమైంది. ఆమె కెరీర్ సైతం డిఫెన్స్ లో పడింది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఆమెను వైసిపి అధికార ప్రతినిధిగా నియమించారు. ఇప్పుడు ఆమె పేరును బాపట్ల నియోజకవర్గ ఇన్చార్జిగా పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం.

బుల్లితెరపై యాంకర్ గా పరిచయం అయ్యారు శ్యామలారెడ్డి. పైగా మధ్యలో వెండితెరపై కూడా మెరిశారు. అయితే ఆది నుంచి వైసీపీ అంటే ఎనలేని అభిమానం కనబరుస్తూ వచ్చారు. గత కొన్నేళ్లుగా వైసీపీలో యాక్టివ్ గా పని చేస్తున్నారు. కానీ ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ఆమెను టార్గెట్ చేసుకున్నారు ప్రత్యర్థులు. పైగా సినీ రంగంలో సైతం అవకాశాలు లేకుండా చేశారు. ఒకానొక దశలో ఆమె మెగాస్టార్ కుటుంబంతో పాటు నందమూరి కుటుంబం పై విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ తరుణంలో ఆమెను ఫుల్ ప్లెడ్జ్ రాజకీయాల్లోకి తేవాలని జగన్ భావించారు. పార్టీ అధికార ప్రతినిధిగా నియమించారు. ఇప్పుడు ఆమె పేరును ఏకంగా బాపట్ల వైసిపి ఇన్చార్జిగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం బాపట్ల వైసీపీ ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో బాపట్ల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు రఘుపతి. ఈ ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. ఎన్నికలకు ముందు ఆయన పై పార్టీలో అసంతృప్త స్వరం వినిపించింది. రఘుపతిని మార్చాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. అయితే రఘుపతి విధేయతను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థిగా ప్రకటించారు జగన్. కానీ ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఇక్కడ వైసిపి ఇన్చార్జిని మార్చాలన్న డిమాండ్, కుల సమీకరణలు తదితర కారణాలతో జగన్ సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు సమాచారం.

బాపట్లలో రెడ్డి సామాజిక వర్గం అధికం. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గ నేతలకు టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ చాలా రోజులుగా వినిపిస్తోంది. రఘుపతి కి వ్యతిరేకంగా రెడ్డి సామాజిక వర్గం గళం ఎక్కిందని అప్పట్లో ప్రచారం నడిచింది. అయితే అసమ్మతినేతల్లో ఎవరికైనా బాధ్యతలు అప్పగిస్తే రఘుపతి సైతం సహకరించే ఛాన్స్ లేదు. అందుకే అక్కడ యాంకర్ శ్యామలారెడ్డిని జగన్ ప్రయోగిస్తున్నట్లు సమాచారం. ఇటీవల రెడ్డి సామాజిక వర్గం వన సమారాధనకు శ్యామల రెడ్డి హాజరయ్యారు. నియోజకవర్గ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అయితే పార్టీ హై కమాండ్ ఆదేశాల మేరకు మాత్రమే ఆమె బాపట్లలో అడుగు పెట్టారని ప్రచారం నడుస్తోంది. త్వరలో జగన్ జిల్లాల పర్యటనకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇంతలో బాపట్ల వైసిపి ఇన్చార్జిగా శ్యామలారెడ్డి పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!