కడప జిల్లా టిడిపి పగ్గాలు అంటే నాకొద్దు… నాకు వద్దు అని రోజులు నడిచేవి. కనీస స్థాయిలో కూడా పోటీ ఉండేది కాదు ఆ పదవికి. దానికి కారణం వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం. వైయస్సార్ అంటే కడప.. కడప అంటే వైయస్సార్ అనే పరిస్థితి ఉండేది. దీంతో ఆ కుటుంబానికి ఎదురెళ్ళి వారు లేకుండా పోయేవారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కనుక.. ఇప్పుడు టిడిపి అధ్యక్ష పదవి కోసం పోటా పోటీ నెలకొంది. ఒకరికి ఇస్తే మరొకరు అసంతృప్తికి గురయ్యే పరిస్థితికి వచ్చింది.
గత రెండుసార్లు టిడిపి జిల్లా పగ్గాలు చేపట్టారు రెడ్డప్ప గారి శ్రీనివాసులురెడ్డి. ఆయన సేవలను గుర్తించిన చంద్రబాబు ఏకంగా పోలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. ఆయన భార్య మాధవి రెడ్డికి కడప అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఆమె విజయం సాధించి గట్టిగానే వాయిస్ వినిపిస్తున్నారు.
మూడోసారి అధ్యక్ష బాధ్యతలు తనకు అప్పగించాలని హై కమాండ్కు డిమాండ్ చేస్తున్నారు రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డి. మొన్నటికి మొన్న రాజ్యసభ పదవి ఆశించారు. కానీ సమీకరణల్లో దక్కలేదు. అయితే తనకు టిడిపి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగించాలని హైకమాండ్ ముందు డిమాండ్ పెట్టారట. అయితే మిగతా నియోజకవర్గాలను ఆయన పెద్దగా పట్టించుకోవడంలేదని.. టిడిపి శ్రేణులను కలుపుకెల్లడం లేదని.. సమన్వయం చేసుకోవడం లేదని ఆయనపై విమర్శ ఉంది.
మరోవైపు కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన భూపేష్ రెడ్డి జిల్లా అధ్యక్ష పగ్గాలు ఆశిస్తున్నారు. జమ్మలమడుగు టిడిపి ఇన్చార్జిగా ఉండేవారు భూపేష్ రెడ్డి. ఆ నియోజకవర్గంలో పోటీకి సన్నాహాలు చేసుకున్నారు. కానీ చివరి నిమిషంలో పొత్తులో భాగంగా సీటును దక్కించుకుంది బిజెపి. బాబాయ్ ఆదినారాయణ రెడ్డి పోటీ చేసేసరికి భూపేష్ రెడ్డికి ఛాన్స్ లేకుండా పోయింది. దీంతో చివరి నిమిషంలో కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటి చేసి సత్తా చాటారు భూపేష్ రెడ్డి. తక్కువ ఓట్ల తేడాతోనే ఓటమి చవిచూశారు. అందుకే తనకు ఒక ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు.
మరోవైపు టిడిపి జిల్లా అధ్యక్ష పగ్గాలు ఆశిస్తున్నారు బిటెక్ రవి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి పులివెందులలో ప్రత్యర్థగా నిలిచారు రవి. జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడే పులివెందుల నియోజకవర్గం లో పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. పులివెందులలో పూర్తిస్థాయిలో పట్టు సాధించేందుకు ప్రయత్నించారు. జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ తగ్గించారు. అందుకే తనకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే సత్తా చాటుతానని హై కమాండ్ కు చెబుతున్నారు. సో కడప టిడిపి జిల్లా అధ్యక్ష పదవికి డిమాండ్ ఏర్పడింది అన్నమాట. దీంతో ఎవరికీ పదవి ఇవ్వాలో.. అన్న విషయంలో హై కమాండ్ సైతం డిఫెన్స్ లో పడిపోయిందట.