కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తత్వం బోధపడిందా? జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాలంటే చిన్న విషయం కాదని భావిస్తున్నారా? తమ నుంచి దూరమైన పార్టీలను కలుపుకెళ్లాలని చూస్తున్నారా? పొత్తులతోనే కాంగ్రెస్ ఉనికి సాధ్యం అన్న అంచనాకు వచ్చారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం చవిచూసింది. ఒకప్పుడు ఢిల్లీ అంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. అటువంటి చోట పూర్తిగా కనుమరుగయింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో వరుసగా పరాజయాలను చవిచూస్తోంది ఆ పార్టీ. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకోవాలంటే పొత్తులు అనివార్యం. అందుకే దేశవ్యాప్తంగా బలమైన మిత్రుల కోసం అన్వేషణ ప్రారంభించారు రాహుల్ గాంధీ. ఈ క్రమంలోనే త్వరలో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో రాహుల్ గాంధీ సమావేశం కానున్నట్లు ప్రచారం సాగుతోంది.
2004లో కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసారు దివంగత రాజశేఖరరెడ్డి. అప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకునే ప్రయత్నాల్లో విఫలం అయింది. ఆ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం పోశారు రాజశేఖర్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర చేసి.. ప్రజల మనసును మార్చారు. కాంగ్రెస్ పార్టీ వైపు చూసేలా చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడంతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఏర్పాటులో కూడా రాజశేఖర్ రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారు. నాటి కేంద్ర ప్రభుత్వానికి మెజారిటీ ఎంపీలను ఏపీ నుంచి అందించి ఆదుకున్నారు.
అయితే ఇప్పుడు అదే స్థితిలో కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. కానీ ఆ పార్టీకి 40 శాతం ఓటు బ్యాంకు లభించింది. 2014 నుంచి వరుసగా జరిగిన మూడు ఎన్నికల్లో కనీసం ఒక్క శాతం ఓటు కూడా తెచ్చుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. దానిని గుర్తించుకునే రాహుల్ గాంధీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వెతుక్కుంటూ వస్తున్నట్లు సమాచారం. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పనిచేసేందుకు ఏపీ కాంగ్రెస్ను సమాయత్తం చేస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్ నేతలు వరుసగా వైసిపి బాటపడుతుండడంతో అధినాయకత్వం ఈ ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. త్వరలో బెంగళూరులో జగన్మోహన్ రెడ్డితో రాహుల్ గాంధీ సమావేశం అవుతారని సమాచారం.
వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అత్యంత విధేయుడు డీకే శివకుమార్. ప్రస్తుతం కర్ణాటక డిప్యూటీ సీఎం గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా కూడా పేరు తెచ్చుకున్నారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వద్దకు రాహుల్ గాంధీని తీసుకొచ్చేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి దూరమైన నేతలు సొంత పార్టీలను ఏర్పాటు చేసుకున్నారు. అటువంటి వారినంత కలిసేందుకు రాహుల్ గాంధీ సిద్ధపడుతున్నారు. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డితో రాహుల్ గాంధీ కీలక చర్చలు జరుపుతారని తెలుస్తోంది. అందుకు బెంగళూరులోని జగన్ ఎలంక ప్యాలెస్ వేదిక కానున్నట్లు సమాచారం.
అయితే జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలం తగ్గుతోంది. ఉనికి చాటుకునేందుకు కూడా పడరాని పాట్లు పడుతోంది. మరోవైపు ఇండియా కూటమి సైతం బలహీనం అవుతోంది. ఇటువంటి సమయంలో రాహుల్ గాంధీ జగన్మోహన్ రెడ్డిని కలవనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమికి అవసరం. అయితే కాంగ్రెస్ పార్టీ అడ్డంకిగా ఉంది. ఇప్పుడు అదే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ వచ్చి జగన్మోహన్ రెడ్డితో చర్చలు జరపడానికి సిద్ధపడుతుండడం మాత్రం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది