ములిగే నక్క మీద తాటికాయ పడటం అంటే ఇదేనేమో. ఇప్పటికే అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. 2014 ఎన్నికల్లో అనుభవం, పవన్ కల్యాణ్, బీజేపీ మద్దతు వంటి అంశాలతో సీఎం కాగాలిరా. కాని 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు అంత సినిమా లేదని ఏపీ ప్రజలు తేల్చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 సీట్లకే పరిమితం అయింది. దీంతో చంద్రబాబు నాయకత్వం మీద చాలామంది అనుమనాలు వ్యక్తం చేశారు. పార్టీ పగ్గాలు వేరే వారికి అప్పగించాలని టీడీపీ నేతలు డిమాండ్ కూడా చేశారు. అయితే ఈ విమర్శలను చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు. 2024 ఎన్నికలు దగ్గర పడటంతో.. ఎలాగైనా చివరిసారిగా సీఎం కావాలని ఆయన కలలు కంటున్నారు. దీనిలో భాగంగానే తనుకు ఇవే చివరి ఎన్నికలని.. గెలిపిస్తే.. అసెంబ్లీకి వెళ్తానని… లేకపోతే లేదని ప్రజలను బ్లాక్‌మైల్ చేయడం కూడా చంద్రబాబు మొదలుపెట్టారు.
ఆయన తనయుడు నారా లోకేష్ కూడా కథనరంగంలోకి దూకుతున్నారు. ఇంతవరకు ఎమ్మెల్యేగా గెలవని లోకేష్.. పార్టీని గెలిపిస్తానని భీరాలు పలుకడం విశేషంగా మారింది. అయితే ఒంటరిగా వెళ్తే…టీడీపీకి మరోమారు ఓటమి తప్పదని గ్రహించిన చంద్రబాబు ఎలాగైనా తిరిగి పవన్ కల్యాణ్‌తో చేతులు కలపడానికి ప్రయత్నిస్తున్నారు. అటు పవన్ కల్యాణ్ కూడా తనకు జనాల్లో ఎంతటి ఓటు బ్యాంకు ఉందో తెలుసు కాబట్టే.. ,చంద్రబాబుతో అంటగాగటానికి రెడీ అవుతున్నారు. అయితే చంద్రబాబుతో కలిసే ప్రసక్తే లేదని బీజేపీ నేతలు అంటున్నారు. ఇదిలా ఉంటే టీడీపీలో కొనసాగితే.. తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని ఆ పార్టీ నేతలు గ్రహిస్తున్నట్టు ఉన్నారు. అందుకే టీడీపీకి గుడ్ బై చెప్పి.. అధికార వైసీపీ పార్టీలో చేరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీకి ఓటమి తప్పదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకే అక్కడ నుంచి వారు తట్ట బుట్ట సర్థుకుంటున్నారు.
ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరి టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం జగన్ చేస్తున్న అభివృద్దిని చూసి ఆయనకు మద్దతునిచ్చిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా వైసీపీలో చేరడానికి రెడీ అయ్యారు. ఆయన వచ్చే నెలలో జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే తాజాగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా టీడీపీని వీడటానికి రెడీ అవుతున్నట్లుగా సమాచారం అందుతుంది. 2024లో తెలుగుదేశం గెలుస్తుందనే నమ్మకం ఆయనకు లేదని.. అందుకే తన వ్యాపారాలు అన్ని కూడా తెలంగాణకు షిఫ్ట్ చేస్తున్నారని సొంత పార్టీ కార్యకర్తలే చర్చించుకోవడం విశేషం. పైకి ఎన్ని మాటలు చెప్పినాసరే.. ఆచరణకు వచ్చేసరికి ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఇప్పటికే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన దాదాపు పోటీ నుంచి దూరం అయినట్లుగానే కనిపిస్తుంది. మరి గల్లా జయదేవ్ రాజకీయంగా ఎలంటి అడుగులు వేస్తారో చూడాలి.