Chandrababu-jagan:ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవడానికి అసలు అర్హుడివేనా? అని చంద్రబాబుని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లకల్లోలం అవుతున్నా, విజయవాడ వరదలతో మునిగిపోతున్నా కనీస చర్యలు లేవే అని ప్రశ్నించారు. బాధిత ప్రజలకు తక్షణం సహాయ సహకారాలు అందించడం మాని సోషల్ మీడియాలో ప్రచారంపైనే ఎక్కువ దృష్టి సారించిన ఈ టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఎంతవరకు న్యాయం అని అన్నారు. ఈ ఘోర విపత్తుకు ముమ్మాటికీ చంద్రబాబు తప్పిదమే కారణమని, చేసిన తప్పులకు వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు.
వరద బాధితుల కష్టాలను చూసి వారిని ఓదార్చి అండగా నిలిచే క్రమంలో వైఎస్ జగన్ ఇటీవల కృష్ణలంక ఏరియాలో పర్యటించారు. రిటైనింగ్ వాల్ దగ్గర కృష్ణా నది ప్రవాహాన్ని పరిశీలించి కృష్ణలంక వాసులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రిటైనింగ్ వాల్ కట్టినందుకు కృష్ణలంక వాసులు తనను ఆపి కృతజ్ఞతలు తెలిపినట్లు జగన్ చెప్పుకొచ్చారు. ఆ గోడ ఉండటంతోనే ఈ రోజు దాదాపు 3 లక్షల మంది నిశ్చితంగా నిద్రపోగలుగుతున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తాము అప్రమత్తంగా వ్యవహరించి ఆ గోడ కట్టడం.. అది ఈ రోజు ఇలా ఇంత మంది ప్రజలకు ఉపయోగపడడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఒకవేళ ఆ రిటైనింగ్ వాల్ లేకుండా ఉండి ఉంటే.. ఈ రోజు విజయవాడ పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని, అసలు ఊహించడానికి కూడా భయంగా ఉందని చెప్పారు. వైసీపీ తరపున బాధిత ప్రజలకు తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని జగన్ మరోసారి భరోసా ఇచ్చారు.