కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలో అధికార వైసీపీ పార్టీలో విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత కమ్మ సామాజికవర్గంపై కావాలనే టార్గెట్ చేసుకున్నారని వసంత నాగేశ్వరరావు కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ పేరు మారిస్తే స్పందించలేని దిక్కుమాలిన స్థితి కమ్మ సామాజికవర్గం ఉందని ఆయన వ్యాఖ్యనించారు. ఆయన అక్కడితో ఆగకుండా మరుసటి రోజు .. ఓ వీడియోను విడుదల చేసి.. రాజధాని అమరావతిలోనే ఉంచాలని వైసీపీ సర్కార్‌ను డిమాండ్ చేశారు. తండ్రి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలతో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఇరుకున పడినట్లు అయింది.
తాజాగా దీనిపై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన తండ్రి చేసిన వ్యాఖ్యలకు తనకు ఎటువంటి సంబంధం లేదని.. తాను ఎప్పటికి కూడా జగన్‌తో ఉంటానని..ఆయన సీటు ఇస్తే పోటీ చేస్తానని లేకపోతే… తప్పుకుంటానని స్పష్టం చేశారు. అయితే వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధిష్టానం సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. దీనిపై వివరణ ఇవ్వాలని వసంత కృష్ణ ప్రసాద్ కోరినట్లు సమాచారం. దీనిలో భాగంగానే పార్టీ ప్రధాన సలహాదారుడు అయిన సజ్జల రామకృష్ణరెడ్డితో భేటీ అయ్యారు. తన తండ్రి వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యలకు తాను ఎటువంటి బాధ్యుడుని కాదని ఆయన వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో మంత్రి జోగి రమేష్‌తో తలెత్తిన వివాదాలను వసంత సజ్జల దృష్టికి తీసుకువెళ్లినట్లుగా సమాచారం అందుతుంది. తాను ఎట్టి పరిస్థుతుల్లో వైసీపీ వీడనని… వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ తరుఫునే పోటీ చేస్తానని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. మరి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌పై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.